పేదల ఆరోగ్యాన్ని పణంగా పెడతారా? | - | Sakshi
Sakshi News home page

పేదల ఆరోగ్యాన్ని పణంగా పెడతారా?

Sep 12 2025 6:33 AM | Updated on Sep 12 2025 6:33 AM

పేదల ఆరోగ్యాన్ని పణంగా పెడతారా?

పేదల ఆరోగ్యాన్ని పణంగా పెడతారా?

మార్కాపురం ప్రభుత్వ మెడికల్‌ కళాశాలను ప్రైవేటుపరం చేయడం తగదు ప్రైవేటుకు అప్పగిస్తే పేదలను జలగల్లా పీల్చిపిప్పి చేయడం ఖాయం ప్రభుత్వమే వైద్య కళాశాలలను నిర్వహించాలి వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి

ఒంగోలు టౌన్‌: మార్కాపురం మెడికల్‌ కాలేజీని ప్రభుత్వమే నిర్మించి నిర్వహించాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను పీపీపీ పేరుతో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం దారుణమన్నారు. వైద్యశాలలను ప్రైవేటుకు అప్పగిస్తే పేదలను జలగల్లా పీల్చిపిప్పి చేస్తారని, పేదలకు ఉచిత వైద్యం అందని ద్రాక్షలా మారిపోతుందని స్పష్టం చేశారు. గురువారం జిల్లా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వెనకబడిన ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రజలకు వైద్య వసతులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మార్కాపురంలో వైద్య కళాశాలను మంజూరు చేశారని చెప్పారు. జగనన్న హయాంలో వచ్చిన మెడికల్‌ కాలేజీలను ప్రైవేటుపరం చేయాలని కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి పాలనలో ఒంగోలులో రిమ్స్‌ పేరుతో ఆస్పత్రి నిర్మించారని, ఈ రోజు రిమ్స్‌లో పేద ప్రజలు వైద్య సేవలు పొందుతున్నారని చెప్పారు. జగనన్న పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రజలకు వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో మంజూరు చేసిన వైద్య కళాశాలను ప్రైవేటుపరం చేస్తే పేదలు ఇబ్బందులు పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో 2,360 మెడికల్‌ సీట్లు ఉన్నాయని జగనన్న తెచ్చిన మెడికల్‌ కాలేజీల్లో కొత్తగా 2550 మెడికల్‌ సీట్లు పేద పిల్లలు చదువుకునేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. ఇప్పుడు కాలేజీలను ప్రైవేటు పరం చేస్తే పేదల సీట్లు పెద్దలకు వెళ్లిపోతాయని చెప్పారు. వైద్య విద్య కోసం ఇక్కడి విద్యార్థులు పక్క రాష్ట్రాలతో పాటుగా చైనా, రష్యాలకు వెళ్లి చదువుకోవాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా తీసేసి బీమా పరిధిలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఆరోగ్యశ్రీకి నెలకు రూ.300 కోట్ల చొప్పున ఏడాదికి రూ.3600 కోట్లు ఖర్చవుతుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు రూ.4500 కోట్ల బకాయిలుంటే కేవలం రూ.600 కోట్లు మాత్రమే ఇచ్చారని చెప్పారు. ఆరోగ్యశ్రీ డబ్బులే ఇవ్వలేని చంద్రబాబు రేపు బీమా కంపెనీలకు కట్టాల్సిన డబ్బులను చెల్లించకపోతే పరిస్థితి ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. చంద్రబాబు సీఎం అయ్యాక సుమారు రూ.2 లక్షల అప్పు తీసుకొచ్చారని, అమరావతి పేరుతో రూ.70 వేల కోట్లతో టెండర్లు పిలిచారని చెప్పారు. ఇందులోంచి కేవలం రూ.6 వేల కోట్లు ఖర్చు పెడితే రాష్ట్రంలోని వైద్య కళాశాలలను పూర్తి చేయవచ్చని, పేదలకు ఉపయోగపడుతుందని చెప్పారు.

ప్రకాశం జిల్లా అంటే ఎందుకంత చిన్నచూపు:

ప్రకాశం జిల్లా అంటే చంద్రబాబుకు ఎందుకంత చిన్నచూపని మాజీ ఎమ్మెల్యే, మార్కాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి అన్నా రాంబాబు ప్రశ్నించారు. వెనకబడిన పశ్చిమ ప్రకాశం జిల్లాకు దివంగత సీఎం రాజశేఖర రెడ్డి పుణ్యమా అని వెలుగొండ ప్రాజెక్టు వచ్చిందని, వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో నాటి సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాలనలో మెడికల్‌ కాలేజీ వచ్చిందని చెప్పారు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఒక్క మెడికల్‌ కాలేజీని కూడా ఎందుకు తీసుకొని రాలేకపోయారని ప్రశ్నించారు. మార్కాపురం మెడికల్‌ కాలేజీ నిర్మాణం ఫౌండేషన్‌ వరకు మాత్రమే వేశారని కూటమి పాలకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించారు. మార్కాపురం మెడికల్‌ కాలేజీని ప్రైవేటు పరం చేయడం పశ్చిమ ప్రజలను ద్రోహం చేసినట్లేనని వ్యాఖ్యానించారు. మార్కాపురంలో ఎవరికై నా అనారోగ్యం వస్తే వందల కిలో మీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోందన్నారు. అదే మెరుగైన వైద్యం అందుబాటులో ఉంటే ఎంతో మంది ప్రజల ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందన్నారు. పీపీపీ వలన వైద్యం ఎక్కడకూ పోదని కథలు చెబుతున్నారని, ప్రభుత్వం చేతిలో ఉన్నప్పుడే పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందన్నారు. ప్రభుత్వమే నేరుగా మార్కాపురం వైద్య కళాశాలను నిర్మించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు, జిల్లా పార్టీ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కేవీ రమణా రెడ్డి, వై.వెంకటేశ్వర్లు, పంచాయతీ రాజ్‌ విభాగం రాష్ట్ర కార్యదర్శి రవీంద్రా రెడ్డి, సీనియర్‌ నాయకులు క్రాంతి కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement