
కలెక్టర్‌గా రాజాబాబు
● గుంటూరు బదిలీ అయిన తమీమ్ అన్సారియా
ఒంగోలు సబర్బన్: జిల్లా కలెక్టర్‌గా పి.రాజా బాబును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గురువారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ల బదిలీల్లో భాగంగా ఇక్కడ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఏ.తమీమ్ అన్సారియాను గుంటూరుకు బదిలీ చేశారు. 2013 బ్యాచ్ ఐఏఎస్ అయిన రాజాబాబు ప్రస్తుతం ఏపీపీఎస్‌సీ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు.
ఒంగోలు సిటీ: ఒంగోలు జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం శుక్రవారం ఉదయం 10.30 గంటలకు పాత జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈఓ చిరంజీవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అధ్యక్షతన నిర్వహించే ఈ సమావేశానికి ప్రజాప్రతినిధులు, అధికారులు తప్పకుండా హాజరు కావాలని కోరారు.
ఒంగోలు: ఈనెల 13న ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్‌లో ఇరువర్గాల ఆమోదంతో కేసుల పరిష్కారానికి కక్షిదారులు సహకరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.భారతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని న్యాయ స్థానాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని, కేసుల పరిష్కారం కోసం 25 బెంచీలు ఏర్పాటు చేశారన్నారు. ఈ జాతీయ లోక్ అదాలత్‌లో జిల్లాలో 9 వేల కేసులు పరిష్కారానికి అర్హమైనవిగా ప్రాథమికంగా గుర్తించినట్లు పేర్కొన్నారు. రాజీకి అర్హత కలిగిన అన్ని క్రిమినల్ కేసులు, మోటారు వాహన ప్రమాద బీమా పరిహారపు చెల్లింపు కేసులు, చెక్ బౌన్స్ కేసులు, వివాహ సంబంధ వ్యాజ్యాలు, అన్ని రకాల సివిల్ కేసులు ఇరువురి ఆమోదంతో పరిష్కరిస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని న్యాయస్థానాల్లో పెండింగ్ కేసుల్లో ఉన్నవారు ఉపయోగించుకుని తమ వ్యాజ్యాలను పరిష్కరించుకోవాలన్నారు. లోక్ అదాలత్‌లో పరిష్కరించుకున్న కేసుల్లో తీర్పు అంతిమ తీర్పు అని, కోర్టుల్లో చెల్లించిన ఫీజును తిరిగి పొందవచ్చన్నారు. ప్రీసిట్టింగ్ రూపంలో ఇరువర్గాల ఆమోదంతో ముందస్తుగా వ్యాజ్యాలు పరిష్కారానికి జిల్లా న్యాయసేవాధికార సంస్థ, సంబంధిత న్యాయవాదులు, మీడియేషన్ న్యాయవాదులు సహకరిస్తారన్నారు. పోలీసు అధికారులు, ప్రభుత్వ అధికారులు, న్యాయవాదులు ఎక్కువ సంఖ్యలో కేసుల పరిష్కారానికి సహకరించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.భారతి పేర్కొన్నారు.