
14న జిల్లా బాలబాలికల కబడ్డీ జట్ల ఎంపిక
ఒంగోలు: జిల్లా బాలబాలికల కబడ్డీ జట్ల ఎంపిక ఈనెల 14న స్థానిక మినీ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు కుర్రా భాస్కరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపిక మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమవుతుంది. 75 కేజీలలోపు బరువున్న బాలురు, 65 కేజీల లోపు బరువున్న బాలికలు, 2006 జనవరి 1వ తేదీ తరువాత జన్మించిన వారు మాత్రమే అర్హులు. ఎంపికై న క్రీడా జట్లు ఈనెల 22 నుంచి 25వ తేదీ వరకు ఎన్‌టీఆర్ జిల్లా విజయవాడలో జరిగే 51వ రాష్ట్ర స్థాయి బాల బాలికల పోటీల్లో జిల్లా తరఫున ప్రాతినిథ్యం వహిసాయి. వివరాల కోసం సెల్: 9948343232 ని సంప్రదించవచ్చు.
సింగరాయకొండ: మండలంలోని ఊళ్లపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు విద్యార్థినిని లైంగికంగా వేధించాడన్న ఆరోపణపై మంగళవారం పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై బీ మహేంద్ర గురువారం తెలిపారు. డిప్యూటీ డీఈఓ చంద్రమౌళీశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు.
బేస్తవారిపేట: ఎస్సీ కాలనీలోని బడిని రద్దు చేసి దూరంగా ఉన్న మోడల్ స్కూల్‌లో విలీనం చేయడంపై విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాఠశాల వద్ద నిరసన వ్యక్తం చేసిన ఘటన బేస్తవారిపేటలో గురువారం జరిగింది. మండలంలోని ఖాజీపురం ఎస్సీ కాలనీలో 1వ తరగతి నుంచి ఐదో తరగతి వరకు పాఠశాల నిర్వహించేవారు. ప్రభుత్వం 3, 4, 5 తరగతులను రద్దు చేసి ఎస్సీ కాలనీకి దూరంగా ఉన్న మోడల్ స్కూల్‌లో విలీనం చేశారు. దాదాపు 40 ఏళ్లుగా ఎస్సీ కాలనీలో ఉన్న పాఠశాలను తీసేయడంతో పిల్లలను దూరంగా ఉన్న బడికి పంపాల్సి రావడంపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గురువారం పాఠశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఎస్సీ కాలనీలోనే 1 నుంచి 5 తరగతులు పెట్టాలని డిమాండ్ చేశారు.