
అట్టహాసంగా ‘కళా ఉత్సవ్–25’
ఒంగోలు సిటీ/చీమకుర్తి రూరల్: సంతనూతలపాడు మండలం మైనంపాడులోని ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ(డైట్ కాలేజీ)లో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో కళా ఉత్సవ్–2025 పోటీలు గురువారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 6 కళలకు సంబంధించి 12 విభాగాల్లో పోటీలు నిర్వహించగా ఒంగోలు, పర్చూరు డివిజన్లలోని 39 ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల నుంచి 311 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైట్ కాలేజీ ప్రిన్సిపాల్ సామా సుబ్బారావు మాట్లాడుతూ.. కళా ఉత్సవ్‌కు విశేష స్పందన లభించిందని, పోటీలకు భారీగా విద్యార్థులు హాజరవడం డైట్ చరిత్రలోనే ఇదే ప్రథమని చెప్పారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో కళా సృజనను వెలికితీసేందుకు, విద్యార్థుల్లో పోటీతత్వం పెంచేందుకు, భారతీయ సంస్కృతి సంప్రదాయాలపై అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. శుక్రవారం నిర్వహిస్తున్న పోటీల్లో కందుకూరు, మార్కాపురం డివిజన్ల విద్యార్థులు పాల్గొంటున్నట్లు తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా విద్యార్థులను పోటీలకు తీసుకురావాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో డైట్ అధ్యాపకులు, నాన్ టీచింగ్ స్టాఫ్, న్యాయ నిర్ణేతలు, ఉమ్మడి జిల్లాలోని రెండు డివిజన్ల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

అట్టహాసంగా ‘కళా ఉత్సవ్–25’