నిందితుడిపై పోక్సో కేసు నమోదు
కొత్తపట్నం: అభంశుభం తెలియని ఇద్దరు బాలికలపై పెదనాన్న వరుసయ్యే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం బయటకు చెబితే చంపేస్తానని బాలికలను బెదిరించడంతో మిన్నకుండిపోయారు. పాఠశాలలో ఉపాధ్యాయుల ద్వారా సమాచారం అందుకున్న తల్లిదండ్రులు కొత్తపట్నం పోలీసులను ఆశ్రయించగా నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. అందిన సమాచారం మేరకు.. కొత్తపట్నం మండలంలో ఓ గ్రామానికి చెందిన ఎనిమిదేళ్ల బాలికలు ఇద్దరిపై అదే గ్రామానికి చెందిన దొడ్ల వీరారెడ్డి ఈ నెల 7వ తేదీ ఆదివారం లైంగికదాడికి పాల్పడ్డాడు. వీరారెడ్డి తన ఇంటి ఎదురుగా ఆడుకుంటున్న ఇద్దరు బాలికలకు మాయమాటలు చెప్పి ఒకరి తర్వాత ఒకరిపై అత్యాచారం చేసినట్లు సమాచారం. తీవ్ర రక్తస్రావమైన బాలికలను వీరారెడ్డి చంపేస్తానని బెదిరించడంతో తల్లిదండ్రులకు చెప్పేందుకు కూడా సాహసించలేదు. పాఠశాలలో నీరసంగా ఉన్న బాలికలను ఉపాధ్యాయులు గుర్తించి ఆరా తీయడంతో విషయం బయటపడింది. టీచర్ల ద్వారా సమాచారం అందుకున్న తల్లిదండ్రులు కొత్తపట్నం పోలీసులను ఆశ్రయించగా ప్రాథమిక దర్యాప్తు అనంతరం నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇద్దరు బాలికలను వైద్య పరీక్షల నిమిత్తం ఒంగోలు జీజీహెచ్‌కు తరలించినట్లు ఎస్సై వేముల సుధాకర్‌బాబు తెలిపారు. కాగా నిందితుడు దొడ్ల వీరారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.