
మోదీ పాలనలో రైతుల పరేషాన్
ఒంగోలు టౌన్: కేంద్రంలో మోదీ అవలంబిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాల ఫలితంగా దేశంలోని రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.వీరారెడ్డి విమర్శించారు. రైతు సంఘం జిల్లా సమితి సమావేశం స్థానిక మల్లయ్యలింగం భవనంలో బుధవారం నిర్వహించారు. సమావేశానికి వడ్డే హనుమారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నల్లచట్టాల రద్దుకు పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చిన ప్రధాన మంత్రి మోదీ మాటనిలుపుకోలేదన్నారు. స్వామి నాథన్ కమిషన్ సూచనల మేరకు మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రంప్ సుంకాలు విధించడంతో అమెరికాలో మనదేశానికి చెందిన ఉత్పత్తులను కొనుగోలు చేయడంలేదని తెలిపారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పత్తికి 11 శాతం ఉన్న పన్నులను ఎత్తి వేయడం పత్తి రైతులకు శరాఘాతంగా మారిందన్నారు. మోదీ పాలనలో నాలుగున్నర లక్షల మంది రైతుల ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇప్పటికీ రోజుకు 31 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి రైతుల సంతకాలతో మోదీకి వినతి పత్రం పంపించనున్నట్లు తెలిపారు. సమావేశంలో రైతు నాయకులు డి.శ్రీనివాస్, బి.రామయ్య, పుల్లయ్య, టివీ శేషయ్య, సీహెచ్ వాసు, ప్రసాద్, లెనిన్, ప్రభాకర్, వెంకటరావు, సాంబశివరావు పాల్గొన్నారు.