
పిడుగుపాటుకు గొర్రెలకాపరి మృతి
● అపస్మారక స్థితిలోకి మరో ఇద్దరు..
కొండపి: పిడుగుపాటుకు ఒకరు మృతి చెందిన సంఘటన కొండపి పంచాయతీలోని కట్టవారిపాలెం గ్రామంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బెజవాడ రామారావు(45), బెజవాడ రమేష్ మామిళ్లపల్లి లక్ష్మయ్య రోజూ మాదిరిగానే గొర్రెలు మేపడానికి నేతివారిపాలెం సమీపంలో పొలాలకు వెళ్లారు. బుధవారం సాయంత్రం వర్షం కురుస్తుండటంతో ముగ్గురూ ఓ చెట్టు కిందకు చేరుకున్నారు. అకస్మాత్తుగా చెట్టుపై పిడుగు పడటంతో బెజవాడ రామారావు అక్కడికక్కడే మృతి చెందాడు. పక్కనే ఉన్న రమేష్,లక్ష్మయ్య అపస్మారక స్థితిలో పడిపోయారు. సమీపంలో ఉన్నవారు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా రామారావు మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. అపస్మారక స్థితిలో ఉన్న రమేష్, లక్ష్మయ్యకు కొండపి వైద్యశాలలో ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం రమేష్‌ను ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. మృతుడు రామారావుకు భార్య రుక్మిణి, కుమారుడు వెంకట సాయి, కుమార్తె బ్రాహ్మణి ఉన్నారు. పిడుగుపాటుతో మృతి చెందిన రామారావు కుటుంబాన్ని తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీఓ రామాంజనేయులు పరామార్శించి వివరాలు తెలుసుకున్నారు. వీరి వెంట వీఆర్వో సుశీల, పంచాయతీ సెక్రటరీ రామ్మోహన్‌రావు ఉన్నారు.