
అసమర్థత పెనాల్టీలై!
పొగాకు రైతు ఉక్కిరిబిక్కిరై..
గిట్టుబాటు ధర రాక ఒకవైపు..వేలం కేంద్రాల్లో తిరస్కరణకు గురౌతున్న బేళ్లతో మరోవైపు ఉక్కిరిబిక్కిరి అవుతున్న పొగాకు రైతును పాలకులు కోలుకోలేని దెబ్బతీస్తున్నారు. కూటమి పాలకులు, బోర్డు అధికారులు కంపెనీలతో కుమ్మకై ్క పొగాకు రైతును నట్టేట ముంచేశారు. అది చాలదన్నట్టు అదనపు కొనుగోళ్లపై జరిమానా వసూలు చేస్తామని బోర్డు అధికారులు షాక్ ఇస్తున్నారు. అదనపు కొనుగోళ్లపై గరిష్టంగా మూడు శాతం, బోర్డు అనుమతి లేకుండా పండించిన పొగాకు అమ్మకాలపై 6 శాతం జరిమానా వసూలు చేయాలని బోర్డు అధికారులు నిర్ణయించారు. కొనుగోళ్లు ప్రారంభమై ఏడు నెలలు కావస్తున్నా పూర్తిస్థాయిలో కొనుగోళ్లు చేయలేని బోర్డు నేడు రైతులపై భారం మోపడం సరికాదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యతో అదనపు పొగాకు అమ్మకాలపై పూర్తి జరిమానాలు రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, కానీ ప్రస్తుత ప్రభుత్వ అసమర్ధత వల్ల తిరిగి జరిమానాలు అమల్లోకి వచ్చాయన్న ఆగ్రహం రైతుల్లో వ్యక్తమవుతోంది.
రైతుల వద్ద ఉన్న అనధికార ఉత్పత్తి పొగాకును అపరాధ రుసుము లేకుండా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి. అసలకే ఈ ఏడాది నష్టాలు పాలవుతామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే అపరాధ రుసుము భయం పట్టుకుంది. అపరాధ రుసుము విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకొని రైతులను ఆదుకోవాలి. కేవలం 10 శాతమే కొనుగోలు చేస్తామని బోర్డు అధికారులు చెబుతున్నారు.
– రాయపాటి సురేష్, నేతివారిపాలెం గ్రామం, కొండపి మండలం, పొగాకు రైతు.

అసమర్థత పెనాల్టీలై!