
జగనన్నకే సాధ్యం
సూపర్ సిక్స్ అట్టర్ ఫ్లాప్ అయింది వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ
రాజన్న రైతు రాజ్యం
దర్శి: ఆనాటి రాజన్న రైతు రాజ్యం మళ్లీ రావాలంటే జగనన్నకే సాధ్యమవుతుందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అన్నారు. మండలంలోని బసిరెడ్డిపల్లె గ్రామంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమానికి హాజరైన బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మలకు పూలు చల్లుతూ డప్పు వాయిద్యాల మధ్య గ్రామంలోకి గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాల అమలులో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలు ఇస్తామని, ఉద్యోగాలు లేనివారికి నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని నిరుద్యోగులను దారుణంగా మోగించారన్నారు. 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామని మహిళలను మోసం చేశారన్నారు. మహిళలకు సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామని అరకొర విదిలించి మోసం చేశారన్నారు. రైతులకు అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు ఇస్తామని మాట తప్పి రూ.5 వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో చేసిన మోసాలే ఈ కూటమి ప్రభుత్వంలో కూడా చేస్తున్నారన్నారు. ఈ పథకాలు ఎవరికైనా వచ్చాయా అని నిరుద్యోగులు, మహిళలను ప్రశ్నించారు. మళ్లీ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సీఎం అవుతారని, అప్పుడు అందరి కష్టాలు తీరుస్తారని అన్నారు.
జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ గ్రామాల్లో రైతులకు గిట్టుబాటు ధరలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడుతుంటే మూలిగే నక్క మీద తాటికాయ పడిన సామెతగా ఎరువులు కొరత తెచ్చి వచ్చి రైతుల నడ్డి విరుస్తున్నారన్నారు. ప్రభుత్వం సబ్సిడీలో ఇవ్వాల్సిన యూరియా ఇవ్వక పోవడంతో రైతులు బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. యూరియా అక్రమ నిల్వలు గుర్తించారే కానీ ఆ నిల్వలు ఎక్కడి నుంచి వచ్చాయో మాత్రం వెల్లడించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. రైతలకు ఇబ్బందులు లేకుండా యూరియా అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ వెన్నపూస వెంకటరెడ్డి, గ్రామ సర్పంచ్ కేసరి రాంభూపాల్‌రెడ్డి, ఎంపీటీసీ బండి గోపాల్‌రెడ్డి, రాష్ట్ర మున్సిపాలిటీ కార్యదర్శి కుమ్మిత అంజిరెడ్డి, మాజీ నెడ్‌కాప్ డైరెక్టర్ సానికొమ్ము తిరుపతిరెడ్డి, వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు కేవీ రెడ్డి, ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు బొమ్మిరెడ్డి లక్ష్మీరెడ్డి, మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ అమీన్ బాషా, మాజీ ఎంపీపీ ఇత్తడి దేవదానం, గ్రామ నాయకులు శ్రీనివాసరెడ్డి, శీలం శ్రీనివాసరెడ్డి, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.