
అక్రమ కేసుల వెనుక మంత్రి డోలా
ఒంగోలు టాస్క్‌ఫోర్స్:
టంగుటూరు మండలం మర్లపాడులో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాన్ని రణరంగంగా మార్చేందుకు టీడీపీ కార్యకర్త ఈదర ప్రవీణ్‌కు మద్యం తాపించి ఉసిగొల్పడమే కాకుండా వినాయక మందిరం వద్ద నానా యాగీ చేయించడం వెనుక మంత్రి డీబీవీ స్వామి హస్తం ఉందని వైఎస్సార్ సీపీ కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆరోపించారు. గొడవ సృష్టించేందుకు కారణమైన టీడీపీ కార్యకర్తను వదిలేసి కేవలం వైఎస్సార్ సీపీ సానుభూతిపరులపై అక్రమంగా నాన్‌బెయిలబుల్ కేసులు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరాయకొండ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో వైఎస్సార్ సీపీ సానుభూతిపరులను ఆదిమూలపు సురేష్ పరామర్శించి ధైర్యం చెప్పారు. తనతోపాటు పార్టీ అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. మర్లపాడులో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం వద్దకు మద్యం మత్తులో వచ్చి రచ్చ చేసినా వైఎస్సార్ సీపీ శ్రేణులు సంయమనం పాటించాయని గుర్తు చేశారు. అయితే గ్రామంలోని గణేశ్ మండపం వద్ద దుస్తులు విప్పి మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన ప్రవీణ్‌కు దేహశుద్ధి చేశారని చెప్పారు. ఇదే అదనుగా వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై కేసులు బనాయించి ఐదు రోజులు అక్రమంగా నిర్బంధించి, చివరకు నాన్‌బెయిలబుల్ కేసులు పెట్టడంపై మండిపడ్డారు. తొలుత బెయిలబుల్ సెక్షన్లు పెట్టిన పోలీసులు ఎవరి మెప్పు కోసం నాన్‌బెయిలబుల్‌గా మార్చారని, ఇంతకంటే దుర్మార్గం మరొకటి ఉందా ప్రశ్నించారు. ఈదర ప్రవీణ్‌ను రెండోసారి ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయడం వెనుక ముమ్మాటికీ మంత్రి స్వామి హస్తం ఉందని ఆరోపించారు. టీడీపీ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని వారికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. ఆయన వెంట టంగుటూరు మండల వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు చింతపల్లి హరిబాబు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
మర్లపాడు ఘటనలో వైఎస్సార్ సీపీ
నాయకులకు రిమాండ్
ఒంగోలు టాస్క్‌ఫోర్స్: వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఈ నెల 2వ తేదీన టంగుటూరు మండలం మర్లపాడు గ్రామంలో చోటుచేసుకున్న ఘటనలకు సంబంధించి వైఎస్సార్ సీపీ సానుభూతిపరులు ఐదుగురిపై పోలీసులు ఈ నెల 3న కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. వినాయక విగ్రహ కమిటీ సభ్యులైన శింగమనేని బ్రహ్మయ్య, ఈదర అమరనాథ్ చౌదరి, మరో ముగ్గురిని ఘటన జరిగిన రోజే అదుపులోకి తీసుకున్న పోలీసులు సోమవారం సింగరాయకొండలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరు పరిచేందుకు ప్రయత్నించగా న్యాయమూర్తి ఆదేశాలతో మంగళవారం హాజరుపరిచారు. ఐదుగురికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు.
మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ కొండపి ఇన్‌చార్జి ఆదిమూలపు సురేష్ ధ్వజం
సింగరాయకొండ కోర్టు ఆవరణలో బాధితులకు పరామర్శ
అధైర్యపడవద్దని, పార్టీ అండగా ఉంటుందని భరోసా