
ప్రయాణికులకు ‘అనంత’ అగచాట్లు
ఒంగోలు టౌన్/పొదిలి: రాష్ట్ర ప్రభుత్వం అనంతపురంలో బుధవారం నిర్వహించనున్న సూపర్ సిక్స్, సూపర్ సక్సస్ సభకు జిల్లా నుంచి 250 ఆర్టీసీ బస్సులను తరలించారు. జిల్లాలో 5 ఆర్టీసీ బస్సు డిపోలు ఉండగా మొత్తం 452 బస్సులున్నాయి. ఇందులో 315 బస్సులను సీ్త్ర శక్తికి కేటాయించారు. ఒంగోలు డిపోలో 75 బస్సులకు గాను 35 హయ్యర్ బస్సులను మినహాయించి మిగిలిన మొత్తం బస్సులను అనంతపురం సభకు తరలించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒంగోలు డిపో బస్సులను అనంతపురం జిల్లాలోని కొన్ని మండలాల ప్రజలను సభకు తరలించడానికి కేటాయించినట్లు తెలుస్తోంది. మంగళవారం ఒంగోలు నుంచి బయలుదేరిన బస్సులు రాత్రికి తమకు కేటాయించిన మండలాల్లోని గ్రామాలకు చేరుకుంటాయని, బుధవారం ఉదయం జనాలను ఎక్కించుకొని సభావేదికకు చేరుకుంటాయని, సభ అయిపోయిన తరువాత తిరిగి ప్రజలను చేరవేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఈ లెక్కన మూడు రోజుల పాటు బస్సులు అనంతపురం సూపర్ సిక్స్ సభ డ్యూటీలోనే ఉంటాయి. ఈ మూడు రోజులు జిల్లా ప్రజలకు చుక్కలు తప్పవని ప్రయాణికులు విమర్శిస్తున్నారు. ఒంగోలు నుంచి అనంతపురం సుమారు 500 కిలోమీటర్లకు పైగానే ఉంది. రాను పోను వేయి కిలో మీటర్లు ఉంటుంది. దీనికి అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరించదని, చివరికి ఆర్టీసీ నెత్తి మీద వేస్తుందని ఆర్టీసీ యూనియన్ నాయకులు చెబుతున్నారు. సహజంగా ఏదైనా ఫంక్షన్‌కు ఆర్టీసీ బస్సు అద్దెకు తీసుకోవాలంటే 18 గంటలకు గాను రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు రుసుము వసూలు చేస్తుందని, 320 కిలో మీటర్లకు మించి ప్రయాణించకూడదని షరతు విధిస్తుందని చెబుతున్నారు. ఆ లెక్కన చూస్తే మూడు రోజులకు కలిపి రూ.5 కోట్ల భారం ప్రజలపై పడుతుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సొమ్మును ఎంతగా దుర్వినియోగం చేస్తుందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చని చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఆర్టీసీ అధికారులు మాత్రం జిల్లా నుంచి కేవలం 120 బస్సులు మాత్రమే అనంతపురం సభకు తరలించినట్లు చెప్పడం గమనార్హం. బస్సులు అందుబాటులో లేకపోవడంతో మంగళవారం జిల్లాలోని ప్రయాణికులు అష్టకష్టాలు పడ్డారు. గంటల తరబడి వేచి ఉన్నా బస్సులు లేవు. వచ్చిన బస్సు ఎక్కువదామంటే మహిళలు, వృద్దులు, పిల్లలకు వీలుపడలేదు. ప్రధానంగా ఉద్యోగులు, విద్యార్థినీ విద్యార్థుల బాధలు వర్ణనాతీతం.
జిల్లా నుంచి 250 ‘ఉచిత బస్సు’లు అనంతపురం సభకు..
మూడు రోజులకు కానీ తిరిగి రాని బస్సులు
జిల్లాకు రూ.5 కోట్ల నష్టం
బస్సుల కొరతతో ప్రయాణికుల ఇక్కట్లు