ఇన్‌చార్జి ప్రభుత్వ ప్లీడర్‌గా శివరామకృష్ణ | - | Sakshi
Sakshi News home page

ఇన్‌చార్జి ప్రభుత్వ ప్లీడర్‌గా శివరామకృష్ణ

Sep 10 2025 10:20 AM | Updated on Sep 10 2025 10:20 AM

ఇన్‌చార్జి ప్రభుత్వ ప్లీడర్‌గా శివరామకృష్ణ

ఇన్‌చార్జి ప్రభుత్వ ప్లీడర్‌గా శివరామకృష్ణ

ఇన్‌చార్జి ప్రభుత్వ ప్లీడర్‌గా శివరామకృష్ణ చెక్‌బౌన్స్‌ కేసులో నిందితునికి ఏడాది జైలు శిక్ష బైక్‌ నుంచి జారిపడి వృద్ధురాలు మృతి

ఒంగోలు: ఇన్‌చార్జి ప్రభుత్వ ప్లీడర్‌గా బీవీ శివరామకృష్ణను నియమిస్తూ కలెక్టర్‌ ఎ.తమీమ్‌ అన్సారియా ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు ప్రభుత్వ ప్లీడర్‌గా డి.శ్రీనివాసమూర్తి వ్యవహరిస్తున్నారు. ఆయన వద్ద నుంచి బాధ్యతలు చేపట్టాలని బీవీ శివరామకృష్ణను ఆదేశించారు. శివరామకృష్ణ ప్రస్తుతం సహాయ ప్రభుత్వ ప్లీడర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఒంగోలు: చెక్‌ బౌన్స్‌ కేసులో నిందితునికి ఏడాది జైలుశిక్ష విధిస్తూ మొబైల్‌ మేజిస్ట్రేట్‌ వి.వెంకటేశ్వరరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఫిర్యాది నంబూరి సుబ్బారావు వద్ద టంగుటూరు మండలం కందులూరు వాసి జి.ఏడుకొండలు రూ.5 లక్షలు అప్పుగా తీసుకున్నారు. కొంతకాలం తరువాత కొంతమేర బకాయి తీర్చేందుకుగాను ఫిర్యాదికి రూ.5 లక్షలకు చెక్కు ఇచ్చాడు. ఫిర్యాది చెక్కును బ్యాంకులో దాఖలు చేయగా బౌన్స్‌ అయింది. ఈ మేరకు ఫిర్యాది కోర్టును ఆశ్రయించగా ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి నిందితునిపై నేరం రుజువైనట్లు పేర్కొంటూ నిందితునికి ఏడాది జైలుశిక్ష, రూ.7.60 లక్షలు చెల్లించాలని ఆదేశించారు. అందులో రూ.7.50 లక్షలు నష్టపరిహారం కింద ఫిర్యాదికి చెల్లించాలని, మిగిలిన రూ.10 వేలు జరిమానా కింద ప్రభుత్వానికి చెల్లించాలని ఆదేశించారు.

పొలంలో ఉన్న భర్తకు ఆహారం

తీసుకెళ్తుండగా గుండెపోటు..

పెద్దదోర్నాల: పొలంలో వ్యవసాయ పని చేస్తున్న భర్త ఆకలి తీర్చేందుకు రొట్టెలు తీసుకెళ్తున్న వృద్ధురాలు మార్గమధ్యంలో గుండెపోటుకు గురై బైక్‌ నుంచి జారిపడి మృతి చెందింది. ఈ విషాద ఘటన పెద్దదోర్నాల మండలంలోని ఐనముక్కల వద్ద మంగళవారం చోటు చేసుకుంది. అందిన సమాచారం మేరకు.. ఐనముక్కలకు చెందిన దర్శనం కాశయ్య, నాగమ్మ(59) భార్యాభర్తలు. బలిజేపల్లి గూడేనికి సమీపంలో ఉన్న సొంత వ్యవసాయ భూమిలో పనిచేస్తున్న భర్తకు రొట్టెలు తీసుకుని ఇంటి నుంచి బయలుదేరిన నాగమ్మ అదే మార్గంలో బైక్‌పై వెళ్తున్న ఓ యువకుడిని యడవల్లి సమీపంలో వదిలిపెట్టాలని కోరింది. ఈ క్రమంలో ఐనముక్కల విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్దకు వచ్చేసరికి తీవ్రమైన గుండెపోటు రావటంతో నాగమ్మ కిందపడిపోయింది. దీంతో ఆమె కుమారుడు, బైక్‌పై వెళ్తున్న యువకుడు ఇద్దరూ కలిసి ఓ ఆటోలో నాగమ్మను దోర్నాలలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స చేస్తుండగా ఆమె మృతి చెందింది. గుండెపోటు వల్లే నాగమ్మ బైక్‌పై నుంచి జారి పడినట్లు పోలీసులకు తెలియజేయడంతో కేసు నమోదు చేయలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement