
యూరియాను నిర్ధిష్ట ధరలకు అందించాలి
● ఎరువుల ప్రైవేటు డీలర్లను ఆదేశించిన కలెక్టర్
ఒంగోలు సబర్బన్:
రైతులకు సకాలంలో నాణ్యమైన ఎరువులు, ముఖ్యంగా యూరియాను నిర్ధిష్ట ధరలకు అందించటమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రైవేటు డీలర్లు కూడా నిబంధనల మేరకు పని చేస్తూ అధికార యంత్రాంగానికి సహకరించాలని ఆమె కోరారు. జిల్లాలోని ఎరువుల డీలర్లతో మంగళవారం ప్రకాశం భవనంలో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎరువుల లభ్యతకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ఐ.ఎఫ్.ఎం.ఎస్. సైట్‌లో నమోదు చేస్తూ ఉండాలని, ఇదే విషయాన్ని వాటి ధరలతో సహా రైతులకు తెలిసేలా షాపుల ముందు కూడా డిస్‌ప్లే చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.శ్రీనివాసరావు, మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ హరికృష్ణ, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.