ఒంగోలు టౌన్: రాంగ్ రూట్లో వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న మోటారు బైకును ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన త్రోవగుంట బ్రిడ్జి వద్ద సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఒంగోలు మండలంలోని అల్లూరు సీవై కాలనీకి చెందిన తొలవల శ్రీను, ఇండ్ల శ్రీను, అద్దూరి బ్రహ్మయ్య(60) బైక్‌పై ఒంగోలు నుంచి త్రోవగుంట వెళ్తున్నారు. త్రోవగుంట బ్రిడ్జి దిగిన వెంటనే ఎదురుగా రాంగ్ రూట్లో వచ్చిన కారు వీరి బైకును ఢీకొంది. ఈ ప్రమాదంలో బ్రహ్మయ్య అక్కడికక్కడే మరణించాడు. త్రగాత్రులు తొలవల శ్రీను, ఇండ్ల శ్రీనును జీజీహెచ్‌కు తరలించారు. తాలుకా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బైకు ఢీకొని మరో వృద్ధుడు..
మార్కాపురం: బైకు ఢీకొని వృద్ధుడు మృతి చెందిన సంఘటన సోమవారం సాయంత్రం పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలోని ఎస్టేట్ వద్ద చోటుచేసుకుంది. పట్టణ పోలీసుల కథనం మేరకు.. ఎస్టేట్‌లో నివసించే ఎన్.వీరారెడ్డి (60) సోమవారం సాయంత్రం రోడ్డు దాటుతుండగా కొనకనమిట్ల వైపు నుంచి మార్కాపురం వస్తున్న బైకు ఢీకొట్టింది. తలకు బలమైన గాయాలైన వీరారెడ్డిని స్థానికులు జీజీహెచ్‌కు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలిస్తుండగా కలుజువ్వలపాడు వద్ద వీరారెడ్డి మృతి చెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ పోలీసులు తెలిపారు.
కావలి వద్ద ఒంగోలు వాసి ఆత్మహత్య!
ఒంగోలు టౌన్: కావలి రైల్వే స్టేషన్లో ఒంగోలు పరిసర ప్రాంతాలకు చెందిన ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. జీఆర్పీ పోలీసుల కథనం ప్రకారం.. కావలి స్టేషన్‌లో దక్షిణం వైపున గుర్తు తెలియని వ్యక్తి ఒకరు పూరి ఎకై ్సప్రెస్ రైలు కింద పడి మరణించాడు. మృతుడి వయసు 55 ఏళ్లు ఉంటుంది. తెలుపు రంగు చొక్కా, పిస్తా గ్రీన్ కలర్ లుంగీ ధరించి ఉన్నాడు. అతడి వద్ద చైన్నె సెంట్రల్ నుంచి ఒంగోలు వరకు తీసుకున్న టికెట్ లభ్యం కావడంతో అతను ఒంగోలు పరిసర ప్రాంతాలకు చెందిన వ్యక్తిగా పోలీసులు భావిస్తున్నారు. వివరాల కోసం 94406 27648ను సంప్రదించాలని జీఆర్పీ ఎస్సై కె.వెంకటరావు సూచించారు.