
ఆలయాల్లో చోరీలు చేస్తున్న ఇద్దరు అరెస్టు
ఒంగోలు టౌన్: దేవాలయాల తాళాలు పగలగొట్టి చోరీ చేయడంతోపాటు మోటారు బైకులను అపహరిస్తున్న ఇద్దరు దొంగలను ఒంగోలు సీసీఎస్, తాళ్లూరు పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. సోమవారం సీసీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నిందితుల వివరాలను సీఐ జగదీష్ వెల్లడించారు. పామూరు మండలం చెరుకుపల్లి గ్రామానికి చెందిన పసుమర్తి లక్ష్మీ నారాయణ, పల్నాడు జిల్లా నరసారావుపేట మండలం దొండపాడు గ్రామానికి చెందిన పులి అంజిరెడ్డి స్నేహితులు. దొంగతనాలు చేయగా వచ్చిన డబ్బుతో జల్సాలు చేయడాన్ని అలవాటుగా మార్చుకున్నారు. వీరిపై జిల్లాలోని పుల్లలచెరువు, కనిగిరి, సిఎస్ పురం, పొదిలి, ఒంగోలు టూ టౌన్, ఒంగోలు తాలుకా, త్రిపురాంతకం, దర్శి, టంగుటూరు, మద్దిపాడు, పల్నాడు జిల్లాలోని వినుకొండ, రొంపిచెర్ల, పిడుగురాళ్ల, వినుకొండ, గుంటూరు జిల్లాలోని అరండల్ పేట, తాడేపల్లి, కర్నూలు జీఆర్పీ, నెల్లూరు జిల్లాలోని ఉలవపాడు పోలీసు స్టేషన్ల పరిధిలో కేసులు నమోదై ఉన్నాయి. ఈ నెల ఒకటో తేది రాత్రి తాళ్లూరు మండలం సోమవరప్పాడు గుంటిగంగ దేవాయలంలో శివాలయం గేటు తాళాలు పగలగొట్టి హుండీని ఎత్తుకెళ్లారు. గత నెల ఆగస్టు 30వ తేదీన దర్శిలోని అద్దంకి రోడ్డులో ఆర్టీసీ బస్టాండ్ వద్ద నిలిపి ఉన్న మోటార్ సైకిల్‌ను అపహరించారు. నరసరావుపేట, గుంటూరులోనే ఇదే తరహాలో దొంగతనాలకు పాల్పడ్డారు. ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాల మేరకు ఒంగోలు సీసీఎస్ సీఐ జగదీష్, తాళ్లూరు ఎస్సై మల్లికార్జున రావు, ఏఎస్‌ఐ మోహనరావు, సీసీఎస్ సిబ్బంది రెండు బృందాలుగా ఏర్పడి గుంటిగంట ఆలయంలో చోరీ కేసు దర్యాప్తు చేపట్టారు. సోమవారం ఉదయం గుంటిగంగ ఆలయ పరిసరాల్లోని వడియరాజుల సత్రం వద్ద ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.7,060 నగదు, 4 బైకులు స్వాధీనం చేసుకున్నారు.