
మెడికల్ కళాశాలలపై ప్రభుత్వ నిర్ణయం బాధాకరం
● వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కె.వి.రమణారెడ్డి
ఒంగోలు సిటీ: రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న 12 మెడికల్ కళాశాలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తూ కూటమి ప్రభుత్వం ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం అత్యంత దుర్మార్గమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కె.వి.రమణారెడ్డి తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రానికి నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ఒక్క ప్రభుత్వ మెడికల్ కళాశాల కూడా స్థాపించలేదని, కేవలం 5 సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దేశంలో ఎవరూ చేయని విధంగా ఒక్కసారిగా 17 మెడికల్ కళాశాలలకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారని వివరించారు. గత ఎన్నికల సమయానికి 5 కళాశాలు పూర్తి చేసి రాష్ట్రంలోని పేద విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించడమే కాకుండా పేద ప్రజలకు ఉచిత వైద్యం కల్పించారన్నారు. అబద్ధపు హామీలతో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం దాదాపు 70 శాతం పనులు పూర్తయి అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్న మిగిలిన 12 కళాశాలను పీపీపీ ముసుగులో భారీగా కమీషన్లకు కక్కుర్తిపడి దొడ్డిదారిన బినామీదార్లకు కట్టబెట్టడం వలన పేదలకు ఉచితంగా వైద్య విద్యతో పాటు వైద్యాన్ని కూడా దూరం చేయడం అన్యాయమన్నారు. వైద్య కళాశాలలన్నీ చంద్రబాబు అనుచరుల కబంధ హస్తాలలో ఉన్నాయని, ఈ 12 కళాశాలలు కూడా టీడీపీ అనుచరుల చేతుల్లోకి పోతే వైద్య విద్యలో టీడీపీ మాఫియా పేట్రేగిపోయే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయంతో వెనుకబడిన, జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్న మార్కాపురం డివిజన్లలో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించిన మెడికల్ కళాశాల కూడా ప్రైవేటుపరమై సరైన వైద్యం అందించే హాస్పిటల్ లేక దూర ప్రాంతాలకు వెళ్లి వైద్యం కొనుక్కోవాల్సిన దుస్థితిలోకి వెళ్తుందన్నారు. ఇప్పటికై నా ఆ ప్రాంత ప్రజల అభిష్టాన్ని గౌరవించి తక్షణమే ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో చరిత్ర హీనులుగా మిగిలిపోతారని అన్నారు.