
గిరిజన న్యాయవాదిపై డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు బూతులు
మాజీ సీఎం వైఎస్ జగన్ పాటలు పెట్టారని అక్కసు
పోలీసులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తల మధ్య తోపులాట
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ‘లాయరైతే ఏంట్రా.. నా కొడకా!. నువ్వో లాయర్‌వి. నీదొక ప్రాక్టీస్. ట్రైబల్ నా కొడకా. వీడితోపాటు మీరు కూడా వచ్చారా. మర్యాదగా బయటకు పొండి’ అని ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు న్యాయవాదులపై బూతులతో రెచి్చపోయారు. ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే..
ఒంగోలు శ్రీనగర్ కాలనీ 4వ లైనులో వినాయక చవితి సందర్భంగా కాలనీకి చెందిన ప్రజలు, వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు పోలీసుల అనుమతి మేరకు ఆదివారం ఉదయం 9 గంటలకు వినాయక నిమజ్జన ఊరేగింపు చేపట్టారు.
మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాటలు పెట్టారన్న అక్కసుతో పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. ఊరేగింపు కర్నూలు రోడ్డులోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్దకు చేరుకోగా ట్రాఫిక్ ఎస్సై, కానిస్టేబుళ్లు ఊరేగింపును అడ్డుకున్నారు. విగ్రహం ఉన్న వాహనాన్ని
ముందుకు కదలనివ్వకుండా ట్రాక్టర్‌కు అడ్డుగా నిలబడ్డారు. దీంతో పోలీసులు, పార్టీ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. దాంతో తాలూకా పోలీసులు లాఠీచార్జి చేశారు. మహిళలు, వృద్ధులని కూడా చూడకుండా లాఠీలు ఝళిపించారు.
ఊరేగింపులో పెట్టిన డీజేలు తీసుకెళ్లారు. తరువాత నిమజ్జనం పూర్తి చేసుకుని తిరిగి వస్తున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఏడుగుర్ని అదుపులోకి తీసుకొని డీఎస్పీ కార్యాలయం వెనక ఉన్న పాత పోలీసు క్వార్టర్స్‌లో నిర్బంధించారు. సమాచారం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు, పార్టీ నాయకులు, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, జయచంద్ర నాయక్, షేక్ హిదాయతుల్లాతో కలిసి సాయంత్రం డీఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. ఇది చూసిన డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు రెచ్చిపోయారు. కార్యాలయం ప్రధాన గేటుకు తాళం వేయించి.. లాఠీలు, కర్రలతో చుండూరి రవిబాబు, న్యాయవాదుల మీదకు వచ్చారు.
న్యాయవాది జయచంద్ర నాయక్‌ను ఉద్దేశించి కులం పేరుతో దూషించారు. ‘న్యాయవాదులైతే ఇక్కడేం పని. బయటకు దెం..య్యండని’ బూతులు లంకించుకున్నారు. పార్టీ కార్యకర్తలను పరామర్శించడానికి వచి్చన వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు, న్యాయవాదులు నగరికంటి శ్రీనివాసరావు, జయచంద్ర నాయక్, షేక్ హిదయతుల్లాతో పాటు మరో ఇద్దరు న్యాయవాదులపై పోలీసు విధులకు ఆటంకం కలిగించినట్టు కేసు నమోదు చేశారు. దీంతో తనను కులం పేరుతో దూషించారని డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావుపై టూటౌన్ పోలీసు స్టేషన్‌లో న్యాయవాది జయచంద్ర నాయక్ ఫిర్యాదు చేశారు. ఈ ఘటన నగరంలో సంచలనం సృష్టించింది.