
పార్టీ కార్యకర్తల మీద చేయిపడితే సహించం
గణేష్ భక్తుల మీద దాడిని అడ్డుకునే క్రమంలోనే తోపులాట
నిమజ్జనాన్ని ఆపివేసి పార్టీ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు
కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్లినందుకు మాపై కేసులు పెడతారా
న్యాయవాదులన్న గౌరవం కూడా లేకపోతే ఎలా
పోలీసులే స్వయంగా నిబంధనలు ఉల్లంఘించడం దారుణం
వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరి రవిబాబు
ఒంగోలు టౌన్: పార్టీ కార్యకర్తల మీద పోలీసులు చేయివేస్తే సహించేది లేదని, కార్యకర్తల కోసం ఎందాకై నా వెడతానని వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు స్పష్టం చేశారు. అవసరమైతే తనపై ఎన్నికేసులు పెట్టినా పర్వాలేదుకానీ, పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదన్నారు. వినాయక నిమజ్జనం ఊరేగింపులో పాల్గొన్న వైఎస్సార్ సీపీ కార్యకర్తల అక్రమ అరెస్టు సమాచారం తెలుసుకొని డీఎస్పీ కార్యాలయానికి వచ్చిన ఆయన కొత్తపట్నం బస్టాండులో మీడియాతో మాట్లాడారు. 45వ డివిజన్ శ్రీనగర్ కాలనీకి చెందిన ప్రజలు వినాయక నిమజ్జనం ఊరేగింపు నిర్వహిస్తుంటే పోలీసులు అడుగడుగునా ఇబ్బందులు పెట్టారని తెలిపారు. కొత్తపట్నంలో నిమజ్జనం చేయడానికి ఊరేగింపుగా బయలు దేరిన వాహనంపై ఏర్పాటు చేసిన డీజేని పగులగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారని తెలిపారు. డీజేని పగులగొట్టకుండా అడ్డుకున్న మహిళలు, పిల్లలపై పోలీసులు దాడి చేశారని ఆరోపించారు. నిమజ్జనాన్ని వేమిరెడ్డి విక్రమ్ రెడ్డి, సతీష్, సిద్దార్ద రెడ్డితో పాటుగా విగ్రహాన్ని దానం చేసిన వెంకటరెడ్డి (దేవుడు), ఆయన కుమారుడు కార్తిక్ రెడ్డిలను అరెస్టు చేశారని చెప్పారు. సమాచారం తెలుసుకున్న వెంటనే వారిని పరామర్శించడానికి తాలుకా పోలీసు స్టేషన్‌కు వెళ్లి చూస్తే అక్కడ వారు లేరని చెప్పారు. అక్రమంగా అరెస్టు చేసిన పార్టీ కార్యకర్తలు ఎక్కడున్నారో తెలుసుకుందామని డీఎస్పీ కార్యాలయానికి వెళ్లినట్లు తెలిపారు. తాము అక్కడున్నప్పుడే పార్టీ కార్యకర్తలను పోలీసు వ్యానులో తీసుకొచ్చారని తెలిపారు. పార్టీ కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్లిన తనతో పాటుగా లీగల్‌సెల్ న్యాయవాదులతో దురుసుగా ప్రవర్తించారని, న్యాయవాదులతో మాట్లాడిన తీరు దుర్మార్గమని చెప్పారు. న్యాయవాదులను దూషించడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. పోలీసు కస్టడీలో ఉన్న పార్టీ కార్యకర్తలను పరామర్శించడం నేరం కాదుకదా అని ప్రశ్నించారు. పోలీసు కస్టడీలో ఉన్న వారిని బలవంతంగా తీసుకొనిపోలేను కదా అని నిలదీశారు. పార్టీ కార్యకర్తలను కొట్టడానికే డీఎస్పీ కార్యాలయం వద్దకు తీసుకొచ్చారని అందరూ చెబుతున్నారని, కార్యకర్తలపై పెట్టిన కేసు వివరాలను అడిగి తెలుసుకునే హక్కు తమకుందని స్పష్టం చేశారు. దానికి బదులుగా పరామర్శించడానికి వచ్చిన తమ మీదనే కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. ఈ దమనకాండను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కేవీ రమణారెడ్డి, వై.వెంకటేశ్వర్లు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొట్లా సుబ్బారావు, నగర అధ్యక్షుడు కఠారి శంకర్, నగర కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ ఇమ్రాన్ ఖాన్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలడుగు రాజీవ్, పార్టీ సీనియర్ నాయకులు వెన్నపూస వెంకటరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మన్నె శ్రీనివాసరావు, రవీంద్రా రెడ్డి, మహిళా నాయకులు భూమిరెడ్డి రమణమ్మ, వడ్లమూడి వాణి, టి.మాధవి, గోనెల మేరి, తాతా నరసింహ గౌడ్, కిరీటి, కరుణాకర్, డివిజన్ అధ్యక్షులు దేవా, శ్రీకాంత్, డివిజన్ అధ్యక్షులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

పార్టీ కార్యకర్తల మీద చేయిపడితే సహించం