
‘అన్నదాత పోరు’
ప్రభుత్వం చేతిలో ఉండాల్సిన యూరియా ప్రైవేటు వ్యక్తుల దగ్గరకు ఎలా వెళ్లింది
ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రుల మాటలు దుర్మార్గం
అన్నదాత పోరు పోస్టర్ ఆవిష్కరించిన మాజీ మంత్రి మేరుగు, బత్తుల, రవిబాబు
చంద్రబాబు కళ్లు తెరిపించేందుకే
ఒంగోలు టౌన్: రైతుల సమస్యలను పరిష్కరించలేక చేతులెత్తేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు అసలు వ్యవసాయం ఎందుకు చేయాలని చెబుతుంటే, ఎరువుల కోసం క్యూలో నిలబడితే తప్పేముంది..భోజనాల కోసం నిలబడడంలేదా అంటూ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెంనాయుడు రైతులతో వేళాకోళాలాడుతున్నారని మాజీ మంత్రి మేరుగు నాగార్జున విమర్శించారు. రైతు సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు కళ్లు తెరిపించేందుకు ఈ నెల 9వ తేదీ ఆర్డీఓ కార్యాలయం వద్దకు వెళ్లి వినతి పత్రాలను అందజేసే కార్యక్రమాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిందని తెలిపారు. జిల్లా వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆదివారం మాజీ మంత్రి మేరుగు నాగార్జున, ఒంగోలు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు, పార్టీ జిల్లా పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులతో కలిసి ‘అన్నదాత పోరు’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మేరుగు నాగార్జున మాట్లాడుతూ... రాష్ట్రంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడిపోతున్నారని, పంటలు కొనే నాథుడులేకుండా పోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఎరువులు కొనాలంటే మాత్రం అధికధరలు వెచ్చించాల్సి వస్తుందని తెలిపారు. రైతులు ఎరువులు దొరక్క అగచాట్లు పడుతుంటే కూటమి ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదన్నారు. రైతు సమస్యల మీద రోడ్డుక్కితే లాఠీలతో జవాబు చెప్పాలని, కేసుల పెట్టి వేధిస్తున్నారని విమర్శించారు. మార్క్‌ఫెడ్ ద్వారా 50 శాతం ఎరువులను అందించాల్సి ఉండగా ప్రైవేటు వ్యక్తుల చేతికి చేరిందని, దీనికి కూటమి పాలకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇన్‌పుడ్ సబ్సిడీ, సున్నా వడ్డీ ఏమయ్యాయో చెప్పాలని ప్రశ్నించారు. కేంద్ర సాయంతో సంబంధం లేకుండా రూ.20 వేలు అదనంగా అందిస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు కేవలం రూ.5 వేలు రైతుల చేతిలో పెట్టి ఒట్టి చేతులు చూపుతున్నారని ఎద్దేవా చేశారు.
ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు మాట్లాడుతూ కూటమి పాలనలో రైతులు దగా పడ్డారని చెప్పారు. రాష్ట్రంలో పొగాకు, శనగ, మిర్చి, ధాన్యంకు గిట్టుబాటు ధరలు లేవని, ఉల్లి పంటను రైతులే పారవేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధరలు అడిగితే కేసులు పెడతామని బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యల గురించి మాట్లాడితే తోకలు కట్ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు బెదిరింపులకు దిగుతున్నారని, ఇలా బెదిరించి పాలన ఎన్నాళ్లు చేస్తారని ప్రశ్నించారు. కూటమి పాలకులకు యూరియా ఎరువులను అందుబాటులో ఉంచడం చేతకావడం లేదని విమర్శించారు.
జిల్లా పార్టీ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ రైతుల సమస్యల పరిష్కారం కోసం జిల్లా వ్యాప్తంగా అన్నీ డివిజన్లలో ఆర్డీఓలకు వినతి పత్రాలను అందజేస్తున్నట్లు తెలిపారు. నేడు ఆరోగ్యశ్రీని రద్దు చేసి బీమాను తీసుకొస్తున్నారని, మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేసి పేదలకు స్పెషాలిటీ వైద్యసేవలు అందకుండా కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కేవీ రమణా రెడ్డి, వై వెంకటేశ్వర్లు, నగర అధ్యక్షుడు కఠారి శంకర్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రొండా అంజిరెడ్డి, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నకరికంటి శ్రీనివాసరావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలడుగు రాజీవ్, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు బంగారుబాబు, మద్దిపాడు ఎస్సీ సెల్ అధ్యక్షుడు రావిపాటి విల్సన్, సంతనూతలపాడు, ఎన్‌జీపాడు మండల పార్టీ అధ్యక్షులు దుంపా చెంచిరెడ్డి, శ్రీమన్నారాయణ, పార్టీ నాయకులు కంకణాల సురేష్, దుంపా యలమందారెడ్డి, నటారు జనార్ధన రెడ్డి, కిరీటి, మలిశెట్టి దేవా, శ్రీకాంత్ వేముల తదితరులు పాల్గొన్నారు.