
మైనారిటీలపై కూటమి చిన్నచూపు
● ముస్లింలకు ఇచ్చిన హామీలు విస్మరిస్తున్న కూటమి ప్రభుత్వం ● 11 నెలలుగా ఇమామ్, మౌజన్‌లకు అందని గౌరవ వేతనం ● ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 400కు పైగా ఇమామ్, మౌజన్‌లు ● మూలన పడిన సంక్షేమ పథకాలు ● నేడు కలెక్టర్‌కు వినతి పత్రాలు ఇవ్వనున్న వైఎస్సార్ సీపీ మైనారిటీ నేతలు
కంభం: ముస్లిం మైనారిటీల ఓట్లు రాబట్టుకునేందుకు ఎన్నో హామీలు గుప్పించిన కూటమి ప్రభుత్వం మైనారిటీల ఓట్లతో గద్దెనెక్కిన అనంతరం వారిని విస్మరించడంపై రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మసీదుల్లో నమాజ్ చదివించేందుకు ఇమామ్, అజాన్ ఇవ్వడం, మసీదు బాగోగులు చూసుకునేందుకు మౌజన్ ఉంటారు. ముస్లింల ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేసిన నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో రూ.5 వేలుగా ఉన్న ఇమామ్‌ల గౌరవ వేతనాన్ని రూ.10 వేలకు, రూ.3 వేలుగా ఉన్న మౌజన్ ల గౌరవ వేతనాన్ని రూ.5 వేలకు పెంచారు. మౌజన్, ఇమామ్‌లు మసీదులే జీవనాధారంగా వారికి వచ్చే గౌరవ వేతనం పైన ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మసీదుల్లో పనిచేసే ఇమామ్, మౌజన్ లకు సుమారు 11 నెలలుగా జీతాల నిధులు విడుదల చేయకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటితో పాటు మైనారిటీలకు ఇచ్చిన హామీలను సైతం అమలు చేయడాన్ని కూటమి ప్రభుత్వం విస్మరించింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఫిబ్రవరి నెలలో ఒకసారి మాత్రమే ఇమామ్‌లు, మౌజన్‌లకు సంబంధించిన జీతాలు విడుదల చేసింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రభుత్వం గుర్తించిన సుమారు 400కు పైగా మసీదుల్లో ఇమామ్‌లు, మౌజన్ లు విధులు నిర్వహిస్తున్నారు. ఇంకా పలు మసీదులకు సంబంధించి ఇమామ్‌లు, మౌజన్‌లు గౌరవ వేతనాల కోసం దరఖాస్తులు చేసుకొని ఎదురుచూస్తున్నారు. వీటితో పాటు దుల్హన్ పథకం, వడ్డీలేని రుణాలు, పెన్షన్‌ల ఊసే లేదని మైనారిటీలు వాపోతున్నారు.
ముస్లింల డిమాండ్‌లు ఇవీ..
50 ఏళ్ల వయస్సు ఉన్న మైనారిటీలకు పెన్షన్. ఈద్గాలు, ఖబరస్తాన్‌లకు స్థలాల మంజూరు, హజ్ హౌస్ ఏర్పాటు, రూ.5 లక్షల వరకు వడ్డీలేని రుణాలు, ఇమామ్, మౌజన్‌ల గౌరవ వేతనంతో పాటు మసీదుల నిర్వహణకు ఆర్థిక సాయం, దుల్హన్ పథకం కింద లక్ష రూపాయల ఆర్థిక సాయం చేయాలని ముస్లింలు డిమాండ్ చేస్తున్నారు.
మైనారిటీలకు అండగా వైఎస్సార్ సీపీ:
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు కావస్తున్నా ముస్లిం, మైనారిటీలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు పరచకపోవడంపై గళమెత్తేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమాయత్తమైంది. అందులో భాగంగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీ నాయకుల ఆధ్వర్యంలో కలెక్టర్ లకు వినతి పత్రాలు అందజేసే కారక్రమం చేపట్టనున్నారు.
చందాలపైనే ఆధారపడాల్సి వస్తోంది
మసీదుల్లో నమాజు చదివించే ఇమామ్, మసీదు బాగోగులు చూసుకునే మౌజన్‌లకు ప్రభుత్వం నుంచి రావాల్సిన గౌరవ వేతనం నెల నెలా రాకపోవడంతో ఇబ్బందిగా ఉంది. చందాలతో వారికి కొంత మేర వేతనాలు ఇస్తున్నాం.
– సయ్యద్ ఖాసిం, మహబూబియా మసీదు కమిటీ అధ్యక్షుడు, కంభం

మైనారిటీలపై కూటమి చిన్నచూపు