కలకలం..! | - | Sakshi
Sakshi News home page

కలకలం..!

Sep 7 2025 7:15 AM | Updated on Sep 7 2025 7:15 AM

కలకలం

కలకలం..!

మార్కాపురం మెడికల్‌ కళాశాలను ప్రైవేటుకు అప్పగింతపై ఆగ్రహం వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో 75 శాతం పనులు పూర్తి సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవలందించే దిశగా అడుగులు మార్కాపురం జీజీహెచ్‌కు కొత్త హంగులు పశ్చిమంలో పది లక్షల మందికి అత్యుత్తమ వైద్యం అందకుండా కుట్ర పేదింటి బిడ్డలకు మెడికల్‌ విద్యను దూరం చేసిన ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు

ప్రైవేటు జపం..

పశ్చిమ ప్రకాశం వాసులకు సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు కావాలన్న కల ఏడు దశాబ్దాలనాటిది. ఆ కలను వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం నెరవేర్చే దిశగా అడుగులు వేసింది. గతేడాది అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం కాలరాసేసింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న వైద్యకళాశాల నిర్మాణ పనులను నిలిపేసింది. గతేడాది మొదటి సంవత్సరం అడ్మిషన్లను అడ్డుకుంది. తాజాగా ఈ కళాశాలను పీపీపీ (పబ్లిక్‌ ప్రైవేటు పార్టనర్‌షిప్‌) విధానంలో నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడంపై పశ్చిమ వాసులు మండిపడుతున్నారు. దాదాపు పది లక్షల మంది ప్రజల ఆశలపై చంద్రబాబు నీళ్లు జల్లారని మండిపడుతున్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో మెడికల్‌ కళాశాలను నిర్మించినట్లయితే పేదలకు ఉచితంగా వైద్యసేవలు అందేవి. ప్రైవేటుపరం చేయడం వలన ప్రతి సేవకు ఫీజు చెల్లించాల్సి వస్తుంది. ప్రైవేటు యాజమాన్యం లాభం గురించే ఆలోచిస్తుంది. అందరికీ సమానమైన వైద్యసేవలు అందుబాటులోకి రావడం కష్టం. సామాన్య, పేద, దిగువ మధ్య తరగతి విద్యార్థులు ర్యాంకులు సాధించినా భారీ ఫీజులు చెల్లించుకోలేక వైద్య విద్యకు దూరమయ్యే పరిస్థితి దాపురించిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మార్కాపురం:

మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల్లో ప్రజలు చిన్నపాటి జ్వరం వచ్చినా అటు నెల్లూరు, నంద్యాల, కర్నూలుకు ఇటు గుంటూరు, విజయవాడలకు పరిగెత్తాల్సి వచ్చేంది. ఈ పరిస్థితిని మార్చేందుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కంకణం కట్టుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మార్కాపురంలో మెడికల్‌ కళాశాల నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. రూ.475 కోట్లు నిధులు విడుదలచేశారు. మార్కాపురం మండలం రాయవరం వద్ద 41.97 ఎకరాల విస్తీర్ణంలో కాలేజీ మంజూరు చేశారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు 75 శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. సిబ్బంది క్వార్టర్స్‌, నర్సింగ్‌ కళాశాల, జంట్స్‌, లేడీస్‌ హాస్టల్స్‌, సెంట్రల్‌ క్యాంటీన్‌ పూర్తిచేశారు. విద్యుత్‌ వైరింగ్‌, ప్లంబింగ్‌, రంగులతోపాటు కొన్ని భవనాల నిర్మాణాలు మాత్రమే పూర్తి చేయాల్సి ఉంది. ఇదే సమయంలో స్థానిక గుండ్లకమ్మ వద్ద ఉన్న జిల్లా వైద్యశాలను జీజీహెచ్‌గా మార్చి 450 బెడ్లను సిద్ధం చేశారు. ఇందులో జనరల్‌ సర్జరీ కోసం 100, జనరల్‌ మెడిసిన్‌ కోసం 100, ఆర్ధోపెడిక్‌ విభాగానికి 40, ఆప్తమాలజీ 20, డెర్మటాలజీ 10, సైక్రియాట్రిక్‌ విభాగానికి 10, ఈఎన్‌టీకి 20, ఐసీయూ 20, పీడియాట్రిక్స్‌ 50, గైనకాలజీకి 50 బెడ్లు కేటాయించారు. ఇలా మార్కాపురం జీజీహెచ్‌ రూపురేఖలు మార్చేశారు. సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకున్నారు. దాదాపు 75 మంది వైద్యులను నియమించారు. ఒక వైపు కళాశాల జోరుగా పనులు మరో వైపు జీజీహెచ్‌లో అభివృద్ధి జరుగుతుంటే పశ్చిమ ప్రకాశం వాసుల వైద్య కష్టాలు తీరినట్టేనని దాదాపు పది లక్షల మంది ప్రజలు సంబరపడ్డారు. 2024 విద్యా సంవత్సరం నుంచే 150 మంది విద్యార్థులతో ఎంబీబీఎస్‌ తరగతులు ప్రారంభమయ్యేలా వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిస్థితులన్నీ తలకిందులయ్యాయి. తమకు అత్యాధునిక వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయని, తమ పిల్లలు ఇక్కడే ఎంబీబీఎస్‌ సీట్లు తెచ్చుకుని డాక్టర్లు అవుతారని కన్న కలలన్నీ కల్లలయ్యాయి.

పశ్చిమంపై బాబు కపట ప్రేమ:

ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మార్కాపురం మెడికల్‌ కళాశాలకు గడ్డు రోజులు మొదలయ్యాయి. ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌లో మార్కాపురం మెడికల్‌ కాలేజీని చేర్చకుండా తీరని నష్టం చేశారు. గత ఏడాది, ఈ ఏడాది నీట్‌ కౌన్సెలింగ్‌లో మార్కాపురం మెడికల్‌ కాలేజీని చేర్చలేదు. ఫలితంగా 300 మెడికల్‌ సీట్లు నష్టపోవాల్సి వచ్చింది. ఇక్కడ నియమించిన వైద్యులను నిబంధనలకు వ్యతిరేకంగా అడ్డగోలుగా బదిలీ చేశారు. అంతటితో ఆగలేదు. అప్పటి వరకూ 75 మంది వైద్యులు ఉండగా అధికారంలోకి వచ్చిన వెంటనే 50 మందిని ఇతర ప్రాంత వైద్యశాలకు బదిలీ చేశారు. ఫలితంగా పశ్చిమ ప్రకాశం ప్రజలకు 2014– 2019 మధ్య నాటి గడ్డురోజులు మళ్లీ ప్రారంభమయ్యాయి. ప్రాణం మీదకు వస్తే అటు గుంటూరు, ఇటు ఒంగోలు, కర్నూలుకు పరుగులు పెట్టాల్సిన దయనీయ పరిస్ధితులు ఏర్పడ్డాయి. పుల్లలచెరువు, యర్రగొండపాలెం, కొమరోలు, గిద్దలూరు, పెద్దారవీడు, అర్ధవీడు, పెద్దదోర్నాల, రాచర్ల మండలాల్లో సుమారు 72 చెంచుగూడేలు ఉన్నాయి. ఇక్కడ వేలాది మంది గిరిజనులు నివాసముంటున్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో గిరిజనులందరికీ ఇక్కడే మంచి వైద్యసేవలు అందాయి. ఇప్పుడు వైద్యులు లేకపోవడంతో నామమాత్రపు వైద్యసేవలు లభిస్తున్నాయి.

పీపీపీతో ఇబ్బందులే..

ప్రభుత్వమే వైద్యశాల నిర్మాణం చేపట్టి వైద్యులను నియమిస్తే ఈ ప్రాంత ప్రజలకు కార్పొరేట్‌ వైద్యం ఉచితంగా లభిస్తుంది. పీపీపీ వలన వైద్యశాల నిర్వహణతో పాటు వైద్య విద్య సీట్లు కూడా ప్రైవేటు మేనేజ్‌మెంటులో ఉంటాయి. దీంతో సాధారణ ప్రజలకు వైద్యం కావాలంటే డబ్బు చెల్లించాల్సిందే. కార్పొరేట్‌ వైద్యసేవలు కావాలంటే మరికొంత డబ్బు చెల్లించాల్సిందే. ఫీజులు చెల్లించే కొద్దీ ప్రై వేటు వైద్యశాలలోలాగా ఇక్కడ కూడా వైద్యసేవలు అందుతాయి. ప్రభుత్వ ఆధిపత్యం, వైద్యశాల, మెడికల్‌ కళాశాలపై తగ్గుతుంది. ఆధునిక టెక్నాలజీ అందుబాటులోనికి వచ్చినా చికిత్స ఖర్చుల భారం ప్రజలపై పడుతుంది.

పశ్చిమ ప్రకాశంలో నియోజకవర్గాలు: 4

పశ్చిమ నియోజకవర్గాల ప్రజలు:10 లక్షలు (సుమారు)

కలకలం..!1
1/1

కలకలం..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement