
అమెరికా సుంకాలపై నోరు మెదపని మోదీ
టారిఫ్‌లను వ్యతిరేకిస్తూ వామపక్షాల నిరసన
ఒంగోలు టౌన్: అమెరికా విధిస్తున్న 50 శాతాల సుంకాలపై ప్రధాని మోదీ నోరుమెదపకపోవడం సిగ్గుచేటని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ విమర్శించారు. రష్యా నుంచి ఆయిల్ దిగుమతిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆంక్షలు విధించడం, బెదిరింపులకు తెగబడుతున్నప్పటికీ మోదీ మౌనంగా ఉండటాన్ని దేశ ప్రజలు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. అమెరికా విధిస్తున్న సుంకాలకు వ్యతిరేకంగా నగరంలోని ఆర్టీసీ డిపో వద్ద సీపీఎం, సీపీఐ, సీపీఐ ఎంఎల్, సీపీఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎల్ నారాయణ మాట్లాడుతూ అప్పుల కుప్పగా మారిన అమెరికా ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు ప్రపంచ దేశాలపై సుంకాల పేరుతో వాణిజ్య యుద్దానికి దిగిందని చెప్పారు. అమెరికా సుంకాలతో భారతదేశం ఆర్ధిక వ్యవస్థ మీద తీవ్రమైన ప్రభావం పడిందన్నారు. ఆక్వా రంగంతోపాటుగా ఆహార ఉత్పత్తులు, వస్త్రాల ఎగుమతులు నిలిచిపోయాయని, రైతులు, పారిశ్రామికవేత్తలు సంక్షోభంలో పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఎస్‌కే మాబు మాట్లాడుతూ రొయ్యల ఎగుమతిపై సుంకాలు పెంచడంతో ఎగుమతులు నిలిచిపోయాయని చెప్పారు. దేశ అంతర్గత వ్యవహారాల్లో ట్రంప్ మితిమీరిన జోక్యం చేసుకుంటున్నారని, దీనివల్ల దేశ సార్వభౌమాధికారానికి భంగం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సీపీఎంఎల్ నాయకురాలు లలిత కుమారి మాట్లాడుతూ ట్రంప్ టారిఫ్‌ల కారణంగా వ్యవసాయరంగం సామ్రాజ్యవాదుల హస్తగతమయ్యే ప్రమాదం నెలకొందన్నారు. సీపీఎంఎల్ న్యూ డెమోక్రసి నాయకుడు సాగర్ మాట్లాడుతూ ప్రపంచ పోలీసు అమెరికా వాణిజ్య యుద్దానికి దిగిందని, ప్రజలంతా ముక్తఖంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. నిరసన కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు జీవీ కొండారెడ్డి, చిట్టిపాటి వెంకటేశ్వర్లు, కాలం సుబ్బారావు, కంకణాల రమాదేవి, ఆదిలక్ష్మి, బాలకోటయ్య, కేఎఫ్ బాబు, బంకా సుబ్బారావు, సీహెచ్ వినోద్, శ్రీరాం శ్రీనివాస్, ఎంఏ సాలార్, ఎల్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.