
రూ. లక్ష పలికిన గణేష్ లడ్డు
యర్రగొండపాలెం: వినాయక చవితి సందర్భంగా స్థానిక కొలుకుల సెంటర్‌లో ఏర్పాటు చేసిన భారీ వినాయక విగ్రహాన్ని శనివారం నిమజ్జనానికి తరలించారు. ఈ సందర్భంగా పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కోలాటం, భజన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మహిళలు పల్లకి సేవలో పాల్గొని తమ భక్తిని చాటుకున్నారు. ముందుగా 9 రోజుల పాటు పూజ కార్యక్రమాల్లో స్వామి ఎదుట ఉంచిన లడ్డూ ప్రసాదం, కలశంలతోపాటు వివిధ వస్తువులను నిర్వాహకులు వేలం నిర్వహించారు. ఈ వేలంలో లడ్డూ ప్రసాదం రూ 1. లక్షకు కొత్త హరిబాబు దక్కించుకున్నాడు. కై పు వెంకటరెడ్డి కలశం వేలంలో పాల్గొని రూ.90 వేలకు సొంతం చేసుకున్నారు. అకౌంట్ బుక్స్ రూ.90 వేలకు ఆవుల బాలిరెడ్డి, పెన్ను రూ.18 వేలకు చెంగళ్ నాగయ్య పాడుకున్నారు. కొలుకుల సెంటర్ నుంచి బస్టాండ్, పోలీస్ స్టేషన్, మండల రెవెన్యూ కార్యాలయంల మీదుగా త్రిపురాంతకంలో ఉన్న నాగార్జున సాగర్ కాలువ వద్దకు వినాయకుడిని తరలించి నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా ఎటువంటి అవాఛనీయ సంఘటనలు, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా సీఐ సీహెచ్ ప్రభాకరరావు ఆధ్వర్యంలో పోలీసులు శాంతిభద్రతలను కాపాడారు.