
8న ప్రధానమంత్రి జాతీయ అప్రంటీస్‌షిప్ మేళా
ఒంగోలు సిటీ: స్థానిక ప్రభుత్వ ఐటీఐ (బాలురు) కళాశాలలో ఈ నెల 8వ తేదీ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రధాన మంత్రి అప్రంటీస్‌షిప్ మేళా నిర్వహించనున్నట్లు సహాయ అప్రంటీస్‌షిప్ అడ్వైజర్, ప్రిన్సిపాల్ సీహెచ్‌ఎస్‌వీ ప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో జిల్లాలోని ప్రముఖ కంపెనీల యాజమాన్యాలు, శ్రీ సిటీలోని ఎంఎన్‌సీ కంపెనీలు, హైదరాబాదు నుంచి ఫార్మాసూటికల్ కంపెనీల హెచ్‌ఆర్‌లు పాల్గొని ఐటీఐ పాసైన అభ్యర్థులను అప్రంటీస్ శిక్షణకు ఎంపిక చేసుకుంటారని తెలిపారు. ఆయా కంపెనీల పారిశ్రామికవేత్తలు పాల్గొని వారి కంపెనీల ప్రాముఖ్యతను తెలియజేస్తారన్నారు. ఎంపికై న అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు శిక్షణాభృతి చెల్లిస్తారని తెలిపారు. ఐటీఐ పాసై ఒకేషనల్ కోర్సు ఉత్తీర్ణులైన అభ్యర్థులు పూర్తి వివరాలకు 97031 65456 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
ఒంగోలు టౌన్: విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భారత విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహెచ్ వినోద్ విమర్శించారు. గురువారం స్థానిక సెయింట్ జేవియర్స్ పాఠశాల నుంచి రంగా భవన్ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రంగా భవన్‌లో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగిస్తూ ఎన్నికల సందర్భంగా విద్యార్థులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 28 నుంచి ఈ నెల 4వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా సైకిల్ యాత్ర నిర్వహించినట్లు తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంటు బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. సంక్షేమ హాస్టళ్లలో మెస్ చార్జీలు సరిపోక అగచాట్లు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు లేవని, సిబ్బంది కొరత వేధిస్తోందని, ఇదే పరిస్థితి కొనసాగితే హాస్టళ్లు మూతపడటం ఖాయమని అన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ వీటిపై నోరుతెరిచి మాట్లాడటం లేదని విమర్శించారు. విద్యారంగంపై దృష్టి సారించాలని హితవు పలికారు. ఈ నెల 6వ తేదీ విజయవాడలో జరిగే ధర్నాను జయప్రదం చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. అనంతరం డీఆర్వోకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ, సీఐటీయూ, ఐద్వా, డీవైఎఫ్‌ఐ నాయకులు పాల్గొన్నారు.