
మెరుగైన వైద్యసేవలు అందించాలి
● ఒంగోలు జీజీహెచ్ అధికారులతో కలెక్టర్ తమీమ్ అన్సారియా సమీక్ష
ఒంగోలు సబర్బన్: అవసరమైన వైద్యసిబ్బందిని నియమించుకుని రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంపై దృష్టి సారించాలని ఒంగోలు జీజీహెచ్ అధికారులను కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా ఆదేశించారు. గురువారం ఆమె క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రధానంగా పీడియాట్రిక్స్, గైనకాలజీ విభాగం ద్వారా అందుతున్న సేవలు, అందుబాటులో ఉన్న సిబ్బంది – ఖాళీలు, తదితర అంశాలపై కలెక్టర్ చర్చించారు. ఖాళీగా ఉన్న పోస్టులలోకి డిప్యుటేషన్ ప్రాతిపదికన వైద్యులను తీసుకోవాలని, ఆ దిశగా ఆసక్తి గల వారి నుంచి విల్లింగ్ లెటర్లు తీసుకోవాలని చెప్పారు. వాటి ఆధారంగా జిల్లాలోని పరిస్థితిని తెలియజేసేలా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని కలెక్టర్ ఆదేశించారు. పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ అయ్యి ఎలాంటి ఆమోదం లేకుండా సెలవు పెట్టిన వారిని తొలగించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఐసీయూ, ఎంఎన్‌సీయూ విభాగాలలో భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యాలరావు, ఆయా విభాగాల వైద్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.