
సారు ఎమ్మెల్యే ఫ్రెండ్ మరి.. కాసులివ్వకుంటే సరేసరి!
మార్కాపురం:
‘నాకు మీ ఎమ్మెల్యే మంచి ఫ్రెండు.. చిన్ననాటి స్నేహితుడు.. నేనెంత చెబితే అంత. నా స్థాయి ఏంటో మీరు ఆలోచించండి’ అంటూ అటు పంచాయతీ కార్యదర్శులను.. ఇటు సర్పంచ్‌లను బెదిరిస్తూ, బ్లాక్‌మెయిల్ చేస్తూ దందాలకు పాల్పడతున్న ఒక మండల పరిషత్ అధికారి తీరు పశ్చిమ ప్రకాశం మొత్తం చర్చనీయాంశమైంది. మార్కాపురం డివిజన్ కేంద్రంలో నివాసముంటున్న సదరు ఎంపీడీఓ వ్యవహారశైలిపై సర్పంచ్‌లు, కార్యదర్శులు ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా, మరికొందరు ఏసీబీ అధికారులకు కూడా ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. కూటమి ప్రభుత్వం రాగానే పక్క జిల్లా నుంచి బదిలీపై వచ్చిన ఆయన.. ‘నేను అధికార పార్టీ ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితుడిని. నేను చెప్పినట్టు వినకుంటే మీ పనులు కావు’ అంటూ అందరినీ బెదరగొట్టేశాడు. ఎవరైనా సర్పంచ్ వచ్చి తాము చేసిన పనిని పరిశీలించి బిల్ చేయాలని కోరితే కనీసం రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు డిమాండ్ చేస్తున్నాడు. దీంతోపాటు ఆయన తిరిగే కారుకు పెట్రోల్ ఫుల్ ట్యాంకు చేయించాల్సిందే. లేదంటే ఆ సర్పంచ్‌తో ఎమ్మెల్యే పేరుచెప్పి బెదిరింపులకు దిగుతున్నాడు. ‘మీరు చేసిన వర్కుకు ఎమ్మెల్యే బిల్ చేయవద్దని చెప్పారు. నేను ఏమీ చేయలేను’ అంటూ తన వద్ద పనిచేసే ఒక ఉద్యోగితో రాయ్ఙబేరం’ పెట్టడం సదరు ఎంపీడీఓకు రివాజుగా మారింది. దీంతో సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు పరిస్థితిని తలచుకుని భయపడుతున్నారు.
టీడీపీ సర్పంచ్‌తో వివాదం
టీడీపీ సానుభూతిపరుడైన సర్పంచ్ తన గ్రామంలో చేపట్టిన పనులను చూసి బిల్ చేయమని కోరగా ఎంపీడీఓ రూ.80 వేలు డిమాండ్ చేశాడు. దీంతో నివ్వెరపోయిన ఆ సర్పంచ్ వెంటనే ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాడు. ఎంపీడీఓ చేసేదేమీ లేక ఆ సర్పంచ్‌తో తన కారుకు పెట్రోల్ ట్యాంకు ఫుల్ చేయించుకుని వెనుదిరిగాడు.
● 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా గ్రామ పంచాయతీల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు బిల్ చేయాలంటే ప్రతి సర్పంచ్ దగ్గర నుంచి కనీసం రూ.50 వేలు డిమాండ్ చేస్తున్నాడు. లేదంటే ఎమ్మెల్యే వద్దన్నాడని ఆ సర్పంచ్‌లకు సమాచారం చేరవేస్తూ మైండ్ గేమ్ ఆడుతున్నాడు. దీంతో సర్పంచ్‌లు లబోదిబోమంటున్నారు.
● ఉపాధి హమీ పథకం బిల్లుల్లో తనకెవరితో సంబంధం లేకుండా 10 శాతం కమీషన్ ఇవ్వాలంటూ హుకుం జారీ చేశాడు. దీంతో అటు టీడీపీ నాయకులు, ఇటు సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. ఎంపీడీఓ తీరుపై ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది.
● ఉపాధి హామీలో భారీ అవకతవకలు జరిగినట్టు వార్తలు రాగానే సంబంధిత సిబ్బందిని పిలిచి ‘చర్యలు తీసుకోకుండా ఉండాలంటే నాకు కమీషన్ ఇవ్వాలి’ అంటూ బహిరంగంగానే డిమాండ్ చేయడం విమర్శలకు తావిస్తోంది. ఇలా ఎమ్మెల్యే పేరు చెప్పి కమీషన్లు వసూలు చేస్తున్న అధికారి తీరుపై అటు పంచాయతీ కార్యదర్శులు, ఇటు సర్పంచ్‌లు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. మార్కాపురం పట్టణంలోని పలు కార్యాలయాల్లో సదరు అధికారి లంచావతారంపై తీవ్రస్థాయిలో చర్చ నడుస్తోంది. ఇప్పటికే పలువురు సిబ్బంది సదరు అధికారి తీరుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ఎమ్మెల్యే కందుల పేరుతో ఓ ఎంపీడీఓ వసూళ్ల దందా
సర్పంచ్‌ల నుంచి లక్షల రూపాయలు డిమాండ్
పనుల బిల్ చేయాలంటే కారు ఫుల్ ట్యాంక్ చేయాల్సిందే..
ఎంపీడీఓ మైండ్ గేమ్‌తో చిర్రెత్తిపోతున్న
సర్పంచ్‌లు, కాంట్రాక్టర్లు