
దాహం తీర్చండి మహాప్రభో
పొదిలి: నీటి సమస్య పరిష్కారం కాకపోవటంతో సహనం నశించిన మహిళలు రాస్తారోకో చేసిన ఘటన పొదిలి బాప్టిస్ట్‌పాలెంలో బుధవారం రాత్రి జరిగింది. నీటి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు నిరసన చేపడతామని భీిష్మించుకుని ఒంగోలు–కర్నూలు రహదారిపై కూర్చొని నినాదాలు చేశారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. మహిళలు మీడియాతో తమ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘వేసవి, వర్షాకాలం అనే తేడా లేదు, గత సంవత్సర కాలంగా నీటి సమస్య వెంటాడుతోంది. దాహం తీర్చండి మహాప్రభో అని ఎంత మంది అధికారులు, నాయకుల వద్ద మొరపెట్టుకున్నా ఒక్కరూ కనికరం చూపలేదు. దీంతో నీరు కొనుక్కోవాల్సి వస్తోంది. ఇంటికొకరు పని మానుకుని నీరు ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ నుంచి తెచ్చుకోవాల్సి వస్తోంది. మరి కొంత మంది బోర్‌నీటితోనే దాహం తీర్చుకుంటున్నారు. ఆ బోర్లు కూడా అడుగంటిపోవటంతో ఏం చేయాలో పాలు పోవటంలేదు. నీటి కోసం పడుతున్న ఇబ్బందులు తెలియచెప్పేందుకే రోడ్డు ఎక్కినట్లు’’ మహిళలు చెప్పారు. సమాచారం అందుకున్న ఎస్సై వేమన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కమిషనర్‌ను కలిసి సమస్య చెప్పాలని మహిళలకు సూచించారు. తాము కూడా కమిషనర్ దృష్టికి సమస్య తీసుకెళ్తామని చెప్పటంతో సుమారు అర్థగంట పాటు చేపట్టిన నిరసనను విరమించారు. పోలీసులు ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.