
దేవుడి భూముల్లోనూ తవ్వకాలు..
సింగరాయకొండ మండలంలోని శానంపూడి పంచాయతీ పరిధిలో నెల్లూరు జిల్లా ఉలవపాడు పంచాయతీలోని నీలకంఠేశ్వరస్వామి దేవస్థానానికి చెందిన 30 ఎకరాల భూమిలో అక్రమ గ్రావెల్ దందా చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై దేవదాయశాఖకు చెందిన ఆర్‌జేసీ స్థాయి అధికారి వచ్చి ఆ ప్రాంతాన్ని పరిశీలించి అక్రమ మైనింగ్ జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి బోర్డు ఏర్పాటు చేసి వెళ్లారు. అయినా అక్రమార్కులు తవ్వకాలు చేస్తూనే ఉన్నారు. పాతసింగరాయకొండ పంచాయతీ పరిధిలో పచ్చతమ్ముళ్ల ఆధ్వర్యంలో భారీగా అక్రమ మైనింగ్ జరగటంతో ఆ ప్రాంతంలో ఉన్న కొండలు కాస్తా ప్రస్తుతం పొలాలుగా, చెరువుల్లాగా మారాయని, వాటిల్లో పచ్చనేతలు జామాయిల్ తోటలను పెంచుతూ ఆక్రమించుకున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. టంగుటూరు మండల పరిధిలోని యరజర్ల పంచాయతీ పరిధిలోని కొండల్లో ప్రతిరోజు సుమారు 300 ట్రిప్పర్లు, 50 ట్రాక్టర్లలో గ్రావెల్ దందా యథేచ్ఛగా జరుగుతోంది. ప్రతిరోజు సుమారు రూ.20 లక్షల విలువైన గ్రావెల్‌ను తరలిస్తుండటంతో కొండలు కరిగిపోతున్నాయి. ఈ ప్రాంతంలో మైనింగ్ అధికారులు చెక్‌పోస్టు ఏర్పాటు చేసినా వాహనాల్లో మట్టి తరలిపోతోంది. మైనింగ్ అధికారులు జేబులు నిండుతుండడంతో మిన్నకుండిపోతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పోలీసు, రెవెన్యూ అధికారులు సైతం మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.