
చదువుతోపాటు కళలూ ముఖ్యం
● నవోదయ విద్యాలయ అసిస్టెంట్ కమిషనర్ బండి చక్రపాణి
ఒంగోలు టౌన్: విద్యార్థులు చదువుతోపాటు కళల్లోనూ రాణించాలని, సహపాఠ్య కార్యకలాపాలైన నృత్యం, గానం, చిత్రలేఖనం, శిల్పకళ, లలిత కళలపై తగినంత శ్రద్ధ చూపాలని నవోదయ విద్యాలయ సమితి అసిస్టెంట్ కమిషనర్ బండి చక్రపాణి సూచించారు. మంగళవారం ఒంగోలులోని జీజీహెచ్ ఆడిటోరియంలో నవోదయ విద్యాలయం రీజినల్‌స్థాయి కళా ఉత్సవ్ పోటీలు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా హాజరైన చక్రపాణి మాట్లాడుతూ.. ఒంగోలుకు సాహిత్య, సాంస్కృతిక నేపథ్యం ఉందని, సినీనటి భానుమతి, ప్రజానాట్యమండలి నుంచి వచ్చిన దర్శకులు టి.కృష్ణ, ముత్యాల సుబ్బయ్య, బాబ్జీ, బి.గోపాల్, రామానాయుడు లాంటి దిగ్గజాలకు ప్రకాశం పుట్టినిల్లు అని పేర్కొన్నారు. అందుకే ఒంగోలులో కళా ఉత్సవ్ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ అశోక్ కుమార్ మాట్లాడుతూ...విద్యార్థుల మెదడు చురుగ్గా పనిచేయడానికి, భావోద్వేగాలను అదుపుల వుంచుకోవడానికి కళలు దోహదం చేస్తాయని చెప్పారు. పోటీల్లో పాల్గొనేందుకు ఏపీ, తెలంగాణ, అండమాన్ నికోబార్, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాల నుంచి 165 మంది విద్యార్థులు, వారి తలిదండ్రులు తరలివచ్చారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం ఇంటర్మీడియట్ విద్యార్థిని కుమారి నేహా చేసిన భరత నాట్యం ప్రేక్షకులను ఆకట్టుకుంది. కార్యక్రమంలో నవోదయ రిటైర్డ్ అసిస్టెంట్ కమిషనర్ ప్రభాకర రెడ్డి, రీజియన్ పరిధిలోని వివిధ నవోదయ పాఠశాలల ప్రిన్సిపాళ్లు చంద్రశేఖర్, పార్వతి, పి.శ్రీనివాసరావు, కె.శ్రీనివాసులు, మ్యూజిక్ టీచర్లు రవిశంకర్, శాంతిశ్రీ, మహాదేవ నాయక్, సనద్ సాహు, ఆర్ట్ టీచర్లు నాగమల్లేశ్వరరావు, జేమ్స్, వీర రాఘవ, ఒంగోలు నవోదయ ప్రిన్సిపాల్ సి.శివరామ్ తదితరులు పాల్గొన్నారు. ఆంగ్ల అధ్యాపకులు చెరుకూరి అయ్యన్న, గుంటూరు నవోదయ ప్రిన్సిపాల్ పి.శ్రీనివారసరావు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

చదువుతోపాటు కళలూ ముఖ్యం

చదువుతోపాటు కళలూ ముఖ్యం