
బ్లాక్ మార్కెట్‌కు రేషన్ బియ్యం!
కంభం: యథేచ్చగా రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం తెల్లవారుజామున కోమటికుంట వద్ద రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తున్న ఓ వ్యక్తిని వేగంగా వెళ్తున్న మినీ ట్రక్ ఢీకొట్టబోయింది. ప్రమాదం బారి నుంచి తృటిలో తప్పించుకున్న సదరు వ్యక్తి వెంటనే జంగంగుంట్ల గ్రామంలో ఉన్న అతని స్నేహితులకు సమాచారం ఇవ్వడంతో మినీ ట్రక్‌ను అడ్డగించారు. వాహనంలో సుమారు 60 క్వింటాళ్ల రేషయం బియ్యం తరలిస్తున్నట్లు గుర్తించి అవాక్కయ్యారు. డ్రైవరు మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. బియ్యాన్ని యర్రగొండపాలెం నుంచి బేస్తవారిపేట తీసుకెళ్తున్నట్లు స్థానికులు అడిగిన ప్రశ్నకు డ్రైవర్ సమాధానమిచ్చాడు. ఇంతలోనే బియ్యం తరలించే వారు అక్కడికి చేరుకొని వాహనాన్ని తమ వెంట తీసుకెళ్లిపోవడం గమనార్హం. ప్రతినెలా ఒకటో తేదీ రాగానే కార్డుదారులకు రేషన్ బియ్యం చేరుతున్నాయో లేదో తెలియదు కానీ అక్రమ రవాణా మాత్రం దర్జాగా సాగుతోందనేందుకు ఈ సంఘటనే నిదర్శనం. నిత్యం రేషన్ షాపుల నుంచి బియ్యం అక్రమ రవాణా చేస్తున్నా అధికారులు మాముళ్లు తీసుకుని చోద్యం చూస్తున్నారన్న విమర్శలకు ఈ ఘటన బలం చేకూరుస్తోంది.
● 44 మోటారు సైకిళ్లు, 7కోళ్లు స్వాధీనం
జరుగుమల్లి(సింగరాయకొండ): జరుగుమల్లి మండలంలోని నర్సింగోలు గ్రామ శివారులో కోడి పందేల శిబిరంపై పోలీసులు మంగళవారం దాడి చేశారు. ఎస్సై బి.మహేంద్ర తమ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకునేలోగా జూదరులు మొత్తం అక్కడి నుంచి పరారయ్యారు. జూద శిబిరం వద్ద ఉన్న 44 మోటార్ సైకిళ్లు, 7 కోళ్లను పోలీసులు స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

బ్లాక్ మార్కెట్‌కు రేషన్ బియ్యం!