
ఎరువుల దుకాణాలపై ఆకస్మిక దాడులు
ఒంగోలు టౌన్: జిల్లాలోని ఎరువుల దుకాణాలు, గోడౌన్లలో పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. జిల్లాలో కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ముమ్మరంగా వ్యవసాయ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో యూరియా, ఇతర ఎరువుల కొరత ఏర్పడినట్లు రైతుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో మంగళవారం పోలీసులు, వ్యవసాయాధికారులు సమన్వయంగా రంగంలోకి దిగారు. జిల్లాలోని 121 ఎరువుల దుకాణాల మీద దాడులు నిర్వహించారు. ఒంగోలు నగరంలోని బండ్లమిట్ట 2, మంగమూరు రోడ్డు 1, త్రోవగుంట 1, పేర్నమిట్ట, కవరది వ్యవసాయ పరిపతి సంఘంలో ఒక దుకాణాలను తనిఖీలు చేశారు. సీఐలు నాగరాజు, విజయకృష్ణ, వ్యవసాయాధికారులు, పోలీసు సిబ్బంది కలిసి తనిఖీలు నిర్వహించారు. స్టాక్ నమోదు, పీఓఎస్ యంత్రాల్లో నమోదైన వివరాలు, పంపిణీ రిజిస్టర్లు, విక్రయపత్రాలకు సంబంధించిన వివరాలను పరిశీలించారు. ఎరువుల దుకాణాల్లో వాస్తవ నిల్వలు, పీఓఎస్ యంత్రాల్లో నమోదైన స్టాక్ మధ్య తేడాలున్నాయా అనే కోణంలో రికార్డులను పరిశీలించారు. యూరియాను ఎమ్మార్పీకే విక్రయిస్తున్నారా లేదా అని దుకాణాల వద్ద ఎరువుల కోసం వచ్చిన రైతులను అడిగి తెలుసుకున్నారు. ఒక్కసారిగా పోలీసులు, అధికారులు దాడులు చేయడంతో వ్యాపారులు ఆందోళనకు గురయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ.. ఎరువుల విక్రయాల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వ్యాపారులను హెచ్చరించారు. కృత్రిమ కొరత సృష్టించి రైతులను ఇబ్బంది పెట్టవద్దని సూచించారు. ఎరువుల విక్రయాలపై రసీదులు తప్పకుండా ఇవ్వాలని ఆదేశించారు. మున్ముందు కూడా తనిఖీలు కొనసాగించనున్నట్లు స్పష్టం చేశారు. ఎరువుల విక్రయాల్లో ఏదైనా అక్రమాలు జరిగినట్లు అనుమానం వస్తే వెంటనే పోలీసులకు కానీ, వ్యవసాయాధికారులకు కానీ సమాచారం ఇవ్వాలని రైతులకు సూచించారు.
జిల్లా వ్యాప్తంగా ఏకకాలంలో
121 ఎరువుల దుకాణాల తనిఖీ