గడపదాటని బేళ్లు.. దగా కొనుగోళ్లు ! | - | Sakshi
Sakshi News home page

గడపదాటని బేళ్లు.. దగా కొనుగోళ్లు !

Sep 2 2025 3:15 PM | Updated on Sep 2 2025 5:50 PM

Farmers taking back unbid bales from the Tanguttur tobacco auction center

టంగుటూరు పొగాకు వేలం కేంద్రం నుంచి నోబిడ్ అయిన బేళ్లను వెనక్కు తీసుకెళ్తున్న రైతులు

చీమకుర్తి/టంగుటూరు/కొండపి: పొగాకు కొనుగోళ్లు మొదలై ఆరు నెలలు గడిచినా నోబిడ్‌ పేరుతో పొగాకు బేళ్లను తిరస్కరిస్తున్న సంఖ్య నానాటికీ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. తేలికరకం నేలల్లో పొగాకు పండించే ప్లాట్‌ఫాంలలో సోమవారం జరిగిన వేలానికి 1873 బేళ్లు రాగా వాటిలో 41.27 శాతం అంటే 773 పొగకు బేళ్లును నోబిడ్‌ పేరుతో తిరస్కరించారు. ప్రతి రోజు నోబిడ్‌ పేరుతో రీజియన్‌ పరిధిలోని 11 వేలం కేంద్రాల్లో వందలాది బేళ్లు తిరస్కరిస్తుండటంతో రైతులు పెట్టిన పెట్టుబడి ఎలా వస్తుందో తెలియక తలలు పట్టుకుంటున్నారు. తిరస్కరించిన బేళ్లను మరొకసారి వేలానికి తీసుకురావడానికి ఖర్చులు పెరుగుతున్నాయని రైతులు వాపోతున్నారు.

పడిపోతున్న ధరలు

2024–25 సీజన్‌కు సంబంధించి పొగాకు వేలం మార్చి పదో తేదీన ప్రారంభమైంది. ప్రారంభ రోజు పొగాకు గరిష్ట ధర కేజీ రూ.280, కనిష్ట ధర కేజీ రూ.260 గా నమోదయింది. దీంతో రైతులందరూ ఆనందం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ధరలు మరింతగా పెరుగుతాయని భావించారు. అయితే నానాటికీ ధరలు పతనమవుతూ వస్తున్నాయి. రైతులు ఆందోళన చేసినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. రైతులను ఆదుకుంటున్నామని కూటమి ప్రభుత్వం పెద్ద ఆర్భాటంగా ప్రకటనలు చేసినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. 11వ రౌండ్‌ ప్రారంభానికి వచ్చేసరికి కనిష్ట ధర రూ.130 కు పడిపోయింది. వేలం కేంద్రాలకు వచ్చిన పొగాకులో కొద్ది వాటికి మాత్రమే అధిక ధర చూపిస్తున్నారు. మిగతావన్నీ తక్కువ ధరకే చూపించి సరాసరి మాత్రం రూ.250 వరకూ చూపిస్తూ మాయచేస్తున్నారని రైతులు ధ్వజమెత్తుతున్నారు.

93.72 మిలియన్‌ కేజీలు కొనుగోలు..

రైతుల నుంచి 104.63 మిలియన్‌ కేజీల పొగాకును కొనుగోలు చేస్తామని బోర్డు (ఆథరైజ్డ్‌ క్వాంటిటీ) రైతులకు పాగాకు సాగుకు ముందు తెలియజేశారు. కాని రైతులు మాత్రం దానిని(ఎస్టిమేషన్‌ క్వాంటిటీ) 158 మిలియన్‌ కేజీలు వరకు పండించినట్లు బోర్డు లెక్కలు కట్టింది. ఆ లెక్కన 158 మిలియన్‌ కేజీలలో ఇప్పటి వరకు కేవలం 93.72 మిలియన్‌ కేజీలను మాత్రమే కొనుగోలు చేసింది. ఇంకా కొనుగోలు చేయాలసిన పొగాకు 64.2 మిలియన్‌ కేజీల పొగాకు రైతుల వద్దే మగ్గిపోతుంది. ఇదిలా ఉండగా నెల్లూరు జిల్లా పరిధిలోని కందుకూరు–1, 2, కలిగిరి, డీసీపల్లి, జిల్లా పరిధిలోని కనిగిరి ప్లాట్‌ ఫాంల్లో కొనుగోళ్లు ముగిసినట్టు అధికారరులు చెబుతున్నారు. అదనపు పొగాకు కొనుగోలు చేయటానికి అనుమతి కోరుతూ ఢిల్లీకి సమాచారం ఇచ్చారు. అక్కడి నుంచి సమాచారం వస్తే గానీ మూసివేసిన 5 ప్లాట్‌ఫాంలలో రైతులు అదనంగా పండించిన పొగాకును కొనుగోలు చేయటానికి వీలు కాదని బోర్డు అధికారులు చెబుతున్నారు.

ఈ ఏడాది నష్టాలే మిగులుతాయి

ఇప్పటి వరకు వేలం కేంద్రానికి పొగాకు బేళ్లు తీసుకొనిపోతే సగం పైగా తిరస్కరణ గురవుతున్నాయి. కేవలం హై గ్రేడు పొగాకునే కొనుగోలు చేస్తున్నారు. లోగ్రేడ్‌ పొగాకు వైపే కన్నెత్తి చూడటం లేదు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంతో అటు ప్రభుత్వాలు, ఇటు అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఇది ఇలా కొనసాగితే నష్టాలే.

– రాయిండ్ల వెంకట నారాయణ, పొగాకు రైతు, పొందూరు గ్రామం, టంగుటూరు మండలం.

ఈ ఏడాది పెట్టుబడులు ఎక్కువయ్యాయి

గత ఏడాది కంటే పెట్టుబడి ఖర్చులు, కూలీల ఖర్చులు, మిగిలినవి ఎక్కువయ్యాయి. దానికి అనుగుణంగా పొగాకు రేట్లు లేవు. గత ఏడాది మేలిమి రకం రూ.360 కొనుగొలు చేస్తే ఇప్పుడు రూ.280 కొనుగోలు చేస్తున్నారు. గత రెండు మూడు రోజులుగా రూ.300కు కొనుగోలు చేస్తున్నారు. కానీ లోగ్రేడు పొగాకు మాత్రం రూ.125కు దించారు. ఇప్పటికై నా రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలి.

– సింగమనేని బ్రహ్మయ్య, పొగాకు రైతు, మర్లపాడు గ్రామం, టంగుటూరు మండలం.

దగా కొనుగోళ్లు ! 1
1/1

దగా కొనుగోళ్లు !

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement