
అందరివాడు వైఎస్సార్
వైఎస్సార్ వర్ధంతిని జయప్రదం చేయండి వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి
ఒంగోలు టౌన్:
కులమతాలకతీతంగా, సమాజంలోని అన్నీ వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి అందరివాడిగా విశేషాదరణ పొందిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని యావత్ తెలుగు జాతి ఎన్నటికీ మరచిపోదని వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్నారు. సువర్ణపాలనతో సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు చేర్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతిని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున నిర్వహించి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సోమవారం వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వృత్తిపరంగా వైద్యుడైన రాజన్న సమాజంలోని అన్నీ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు ఉమ్మడి రాష్ట్రంలో చేసిన 1450 కిలో మీటర్ల పాదయాత్ర దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలబడిపోయిందని చెప్పారు. పాదయాత్రలో ప్రజలతో మమేకమైన ఆయన అధికారం చేపట్టిన తరువాత ప్రజారంజక పాలన అందించారని గుర్తు చేశారు. రైతు రుణాలను రద్దు చేస్తూ తొలిసంతకం చేసిన గొప్ప సంస్కరణవాదిగా నిలిచారన్నారు. సామాన్య నిరుపేదల కోసం ఆరోగ్య శ్రీ పథకాన్ని అమలు చేసి లక్షలాది మంది ప్రాణాలను కాపాడారని చెప్పారు. దారిద్య్ర రేఖకు దిగువ ఉన్న పిల్లలకు కార్పొరేట్ కళాశాలల్లో ఉన్నత విద్యనభ్యసించేందుకు అవకాశం కల్పిస్తూ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని తీసుకొచ్చారన్నారు. జలయజ్ఞంతో ఎన్నో ప్రాజెక్టులు నిర్మించారన్నారు. 108 అత్యవసర వాహనాలను ప్రవేశపెట్టారని, మారుమూల ప్రజలందరికీ వైద్య సేవలు అందించేందుకు 104 మొబైల్ క్లినిక్‌ను ప్రారంభించారని తెలిపారు. ముస్లిం సోదరులకు 4 శాతం రిజర్వేషన్లను కల్పించి వారి సామాజిక ఎదుగుదలకు చేయూతనందించారని చెప్పారు. వారసుడిగా ఆయన ఆలోచనలను మరింత ముందుకు తీసుకెళుతున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అండగా నిలబడి అడుగులో అడుగేసి నడుద్దామని పిలుపునిచ్చారు.