
కూటమిది కక్షపూరిత పాలన
ప్రజలను మోసగించడం బాబుకి పరిపాటిగా మారింది అభివృద్ధి, సంక్షేమాన్ని మరచిన కూటమి ప్రభుత్వం మాజీ మంత్రి మేరుగు నాగార్జున ధ్వజం
సంతనూతలపాడు (చీమకుర్తి రూరల్):
కూటమి ప్రభుత్వం ఏడాది పాలన అంతా కక్షపూరితంగా సాగిందని, ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, మర్డర్లు, మహిళలపై అఘాయిత్యాలే తప్ప అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రభుత్వం గాలికి వదిలేసిందని సంతనూతలపాడు ఇన్‌చార్జ్ మేరుగు నాగార్జున అన్నారు. రుద్రవరం, గురవారెడ్డిపాలెం గ్రామాల్లో సోమవారం బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు దుంపా చెంచిరెడ్డి అధ్యక్షత వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మేరుగు నాగార్జున పాల్గొని మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ పోరాటాల వలనే ఒకటి రెండు పథకాలైనా తూతూమంత్రంగా అమలు చేశారన్నారు. ఎన్నికల ముందు ముసలి కన్నీరు కార్చి అధికారంలోకి వచ్చిన తరువాత వెన్నుపోటు పొడవటం చంద్రబాబుకు అలవాటే అన్నారు. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రశ్నించిన వారిపై అరెస్టులు, అసత్య ప్రచారాలు, కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేయడం సర్వసాధారణమైందని విమర్శించారు. అన్నదాతకు ఎరువుల కొరత, పండించిన పంటకు మద్దతు ధర లేదని ధ్వజమెత్తారు. కూటమి దౌర్జన్య పాలనకు చెక్ పెట్టాలంటే వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ ను మళ్లీ సీఎం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ బీ విజయనాగేశ్వరరావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ, దుంపా ఎలమందరెడ్డి, సర్పంచ్‌లు బలరామిరెడ్డి, విజయలక్ష్మి, ఎంపీటీసీలు వెంకట కృష్ణారెడ్డి, మాధవి, రుద్రవరం గ్రామ పార్టీ అధ్యక్షుడు ఉదయ్‌కుమార్ రెడ్డి, మద్దిపాడు ఎంపీపీ వాకా అరుణ కోటిరెడ్డి, గురవరెడ్డిపాలెం గ్రామ పార్టీ అధ్యక్షుడు కే బ్రహ్మారెడ్డి, పవన్‌కుమార్‌రెడ్డి, మేకల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.