
రోస్టర్‌లో అక్రమాలు
సాగర్ కాలువలో వ్యర్థాలు శిథిలావస్థలో ప్రభుత్వ భవనాలు మీ కోసం కార్యక్రమంలో వెల్లువెత్తిన ఫిర్యాదులు
తెలుగు పండిట్
ఒంగోలు సబర్బన్: 2008 డీఎస్సీ గ్రేడ్–2 తెలుగు పండిట్ పోస్టుల ఎంపిక ప్రక్రియ రోస్టర్ కం మెరిట్ లిస్టులో చోటుచేసుకున్న అక్రమాలపై విచారణ జరిపించాలని బీసీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పొటికలపూడి జయరాం సోమవారం ప్రకాశం భవనంలో నిర్వహించిన మీ కోసం కార్యక్రమంలో కలెక్టర్ తమీమ్ అన్సారియాకు ఫిర్యాదు చేశారు. మొత్తం 250 పోస్టుల కోసం నోటిఫికేషన్ ఇచ్చారని, మూడు జాబితాలుగా పోస్టులు భర్తీ చేశారని, అయితే ఈ ప్రక్రియలో అక్రమాలు చోటుచేసుకున్నాయని వివరించారు. మీ కోసం కార్యక్రమానికి అర్జీలు వెల్లువెత్తాయి. జిల్లా నలుమూలల నుంచి అర్జీదారులు క్యూ కట్టారు. కలెక్టర్ వచ్చి వెంటనే వెళ్లిపోగా, జేసీ గోపాలకృష్ణ అర్జీలు స్వీకరించారు.
సాగర్ కాలువలో చేపలు, చికెన్ వ్యర్థాలు...
చీమకుర్తి సమీపంలోని నాగార్జునసాగర్ కాలువలో చేపల, చికెన్ వ్యర్థాలు కలుస్తున్నాయని చీమకుర్తికి చెందిన గుండాల శ్రీనివాసరావు మీ కోసం కార్యక్రమంలో ఫిర్యాదు చేశాడు. వ్యర్థాలు కలపడం వలన అంతుచిక్కని వ్యాధులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న దిగువ ప్రాంత ప్రజలైన సంతనూతలపాడు, ఒంగోలు నగర ప్రజలను కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. చీమకుర్తి గ్రామంలోని పడమర బైపాస్ వద్ద సాగర్ కాలువకు ఇరువైపులా అనుమతి లేని చేపల మార్కెట్ ఉంది. ఇక్కడ చేపలు కొన్న వారికి అక్కడే కోసి శుభ్రం చేసి అమ్ముతారు. ఆ వ్యర్థాలు నాగార్జున సాగర్ కాలువలో కలవడం వలన జలాలు కలుషితం అవుతున్నాయి. ఈ సాగర్ జలాలే చీమకుర్తి నుంచి సంతనూతలపాడు చెరువుకు, ఒంగోలు నగరంలోని సమ్మర్ స్టోరేజీ ట్యాంకులకు, దిగువ ప్రాంత గ్రామాల చెరువులకు తాగునీటికి సరఫరా అవుతున్నాయి. ఈ నీటిని సుమారు ఆరు లక్షల మందికిపైగా తాగుటానికి వాడుతుంటారు. అసలే గ్రానైట్ క్వారీలలోని ప్రాణాంతక వ్యర్థ జలాలు కలుస్తున్నాయి. దానికి తోడుగా మధ్యలో చికెన్, చేపల వ్యర్థాలు కాలువలో కలపడం వలన ఈ నీళ్లు తాగిన వాళ్లకు అనేక రకాల వ్యాధులు, విషపూరిత జ్వరాలు, కిడ్నీ, క్యాన్సర్ వ్యాధులు, చర్మ సంబంధిత వ్యాధులు ప్రబలుతున్నాయి. పొలాలకు వెళ్లి పని చేసే రైతులు కాళ్ల దద్దుర్లు, ఇతర చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. పశువులు కూడా అనారోగ్యంతో చనిపోతున్నాయని శ్రీనివాసరావు వివరించారు.
శిథిలావస్థలో ప్రభుత్వ భవనాలు...
కొత్తపట్నం మండలంలోని కొన్ని ప్రభుత్వ భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని పారా లీగల్ వలంటీర్ చింతల ఆంజనేయులు మీ కోసం కార్యక్రమంలో ఫిర్యాదు చేశాడు. కొత్తపట్నం తహసీల్దార్, ఎంపీడీఓ, అంగన్‌వాడీ సెంటర్లు కొన్నింటి గోడల్లో చెట్లు మొలిచాయి. ఆ చెట్లు పెద్దగా మారడంతో గోడలు పగుళ్లిచ్చి కూలిపోయే స్థితికి చేరుతున్నాయి. మండల ప్రజలకు, రైతులకూ సేవలందించే కొత్తపట్నం తహసీల్దార్ కార్యాలయం శిథిలావస్థకు చేరింది. ఇతర ప్రభుత్వ భవనాలు కూడా కూలిపోయే స్థితికి చేరుకున్నాయి. మండలంలోని కొన్ని అంగన్‌వాడీ భవనాలు కూడా కూలిపోయే స్థితిలో ఉన్నాయి. అవి ఎప్పుడైనా పిల్లలు ఉన్నప్పుడు కూలి వారిపై పడవచ్చని, అలా జరగకముందే తగిన చర్యలు తీసుకోవాలని ఆంజనేయులు కోరారు.

రోస్టర్‌లో అక్రమాలు