
గుండ్లకమ్మతో సస్యశ్యామలం...
జిల్లా అభివృద్ధిపై వైఎస్సార్ చెరగని ముద్ర
సాగు, తాగునీటి ప్రాజెక్టులకు శ్రీకారం
రిమ్స్, ఆరోగ్యశ్రీతో పేదల దరికి మెరుగైన వైద్యం
నేడు వైఎస్సార్ వర్ధంతి
మార్కాపురం: అప్పటి దాకా కరువు కాటకాలతో అల్లాడిన జిల్లా స్థితిగతులు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కావడంతో మారిపోయాయి. జిల్లాకు జలజీవాన్ని అందించే ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన ఆయన వాటిని కార్యరూపం దాల్చేలా చేశారు. జిల్లా అభివృద్ధిపై తనదైన ముద్రవేశారు. తన పాలనలో ఉచిత విద్యుత్, పావలా వడ్డీ రుణాలు, ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంటు ఇలా చరిత్రలో గుర్తుండిపోయే పథకాలను ప్రవేశపెట్టిన డాక్టర్ వైఎస్సార్ కోట్లాది కుటుంబాల్లో వెలుగులు నింపారు. ఆయన దివికేగి 16 ఏళ్లు గడచినా ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు జిల్లా ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి.
ఒంగోలు రిమ్స్ తలమానికం
ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ప్రజలకు వైద్య సదుపాయాలు లేక ఏ చిన్నపాటి రోగం వచ్చినా, సర్జరీ చేయాలన్నా అటు గుంటూరు, ఇటు కర్నూలు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. దీంతో అప్పటి ముఖ్యమంత్రి ఒంగోలులో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మెడికల్ కళాశాల నిర్మాణం కోసం రూ.250 కోట్లు కేటాయించి రిమ్స్‌ను ఏర్పాటు చేశారు. ఆ వైద్యశాలను ప్రస్తుతం జీజీహెచ్‌గా మార్చారు.
వెలుగొండ ప్రాజెక్టు పనులకు శ్రీకారం
2005 మేలో వైఎస్ రాజశేఖరరెడ్డి వెలుగొండ ప్రాజెక్టు పనులను, మార్కాపురం సమీపంలోని గొట్టిపడియ, సుంకేశుల డ్యామ్ పనులను ప్రారంభించారు. 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 16 లక్షల మందికి తాగునీరు అందించేలా ప్రాజెక్టును డిజైన్ చేశారు. 18.8 కి.మీ పొడవుతో దోర్నాల మండలం కొత్తూరు వద్ద 2 టన్నెల్స్‌ను మంజూరు చేయించి పనులు ప్రారంభించారు. మహానేత చివరిరోజు వరకూ వెలుగొండపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో అప్పట్లో పనులు వేగవంతం అయ్యాయి. ఆ తరువాత వచ్చిన చంద్రబాబునాయుడు ప్రాజెక్టుపై దృష్టి సారించకపోవడంతో పనులు మందకొడిగా సాగాయి.
తండ్రి బాటలో తనయుడు
తండ్రి బాటలోనే పయనిస్తూ ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా వివిధ అభివృద్ధి పనులు చేసి జిల్లా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఐదేళ్ల పాలనలో తండ్రి ఆశయాలను కొనసాగిస్తూ వెలుగొండ ప్రాజెక్టును 2024 మార్చి 6న జాతికి అంకితం చేసి దశాబ్దాల కలను నెరవేర్చారు. ఆసియాలోనే అత్యంత పొడవైన సొరంగ మార్గాలను పూర్తిచేసి చరిత్ర సృష్టించారు. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చారు. నాడు తండ్రి ప్రారంభించిన పనులను తనయుడు పూర్తిచేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రూ.400 కోట్లతో సాగర్ కాలువల ఆధునికీకరణ పనులు చేపట్టడంతో జిల్లాలోని త్రిపురాంతకం, పుల్లలచెరువు, దర్శి, చీమకుర్తి, సంతనూతలపాడు, యర్రగొండపాలెం, పర్చూరు, అద్దంకి తదితర ప్రాంతాల్లోని 4.50 లక్షల ఎకరాల సాగర్ ఆయకట్టు సస్యశ్యామలమైంది. కనిగిరి నియోజకవర్గంలో రూ.175 కోట్లతో రక్షిత మంచినీటి పథకాన్ని మంజూరుచేసి ఫ్లోరైడ్ వాటర్ నుంచి ప్రజలను రక్షించేందుకు చర్యలు తీసుకున్నారు. గిద్దలూరు నియోజకవర్గంలో రూ.12 కోట్లతో బైరేనిగుండాల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. రూ.22 కోట్లతో రామన్నకతువ నిర్మించారు. 2004 మే నెలకు ముందు జిల్లాలో 63,559 మంది రైతుల కరెంటు బకాయిలను వైఎస్‌ఆర్ రద్దు చేశారు. అప్పటికే జిల్లా వ్యాప్తంగా 71,321 మంది రైతులకు ఉచిత విద్యుత్ అందించారు.
● ఒంగోలులో రిమ్స్ వైద్యశాల అభివృద్ధి కోసం అదనంగా రూ.170 కోట్లు మంజూరు చేశారు. అత్యాధునిక వైద్య సౌకర్యాల కోసం మరో రూ.100 కోట్లతో జీజీహెచ్‌లో అభివృద్ధి పనులు చేపట్టారు.
● పశ్చిమ ప్రకాశం ప్రజలకు వైద్యసేవలు అందని ద్రాక్షలాగా మారిన నేపథ్యంలో రూ.475 కోట్లతో మెడికల్ కళాశాల మంజూరు చేయడంతో పాటు నిధులు కేటాయించడంతో 70 శాతం పనులు పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత నిర్లక్ష్యం చేయడంతో పనులు నిలిచిపోయాయి.
● దోర్నాలలో సూపర్‌స్పెషాలిటీ వైద్యశాలను కూడా మంజూరు చేసి నిధులు కేటాయించారు.
● ఒక్క మార్కాపురం నియోజకవర్గంలోనే ఐదేళ్లకాలంలో సుమారు రూ.1500 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు జరిగాయి.
● మార్కాపురం మండలంలోని గొట్టిపడియ వద్ద సుమారు రూ.1200 కోట్లతో ఇన్‌టెక్‌వెల్ ట్యాంకుకు నిధులు మంజూరుచేసి 70 శాతం పనులు పూర్తిచేశారు. వెలుగొండ నీటిని దీనికి కేటాయించి ఈ ట్యాంకు నుంచి మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు, యర్రగొండపాలెం తదితర నియోజకవర్గాల్లోని సుమారు 500 గ్రామాలకు పైగా ప్రజలకు నీటిని అందించనున్నారు.
బీసీ–ఈ కోటా వైఎస్సార్ చలవే
దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన బీసీ–ఈ రిజర్వేషన్లు ముస్లింల పాలిట వరంగా మారాయి. బీసీఈ కోటాలో 4 శాతం రిజర్వేషన్ల సహాయంతో ఎంతో మంది ముస్లిం విద్యార్థులు ఎంబీబీఎస్, ఇంజినీరింగ్ విద్యనభ్యసించడంతో పాటు ఉన్నత ఉద్యోగాలు పొందుతున్నారు. కంభం పట్టణంలో ఇప్పటి వరకు సుమారు 20 మంది ముస్లిం విద్యార్థులు ఎంబీబీఎస్ పూర్తి చేయగా ఈ ఏడాది పట్టణానికి చెందిన షేక్ అమీర్‌బాష కుమార్తె ఈనెల 25న జరిగిన మొదటి దశ కౌన్సెలింగ్ లోనే శ్రీకాకుళం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించింది.
గుండ్లకమ్మతో సస్యశ్యామలం...
వృథాగా పోతున్న నీరు నిల్వచేసి ప్రాజెక్టు కడితే రైతులకు ఉపయోగపడుతుందని భావించిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గుండ్లకమ్మ ప్రాజెక్టు కోసం అప్పట్లోనే రూ.543.43 కోట్లు కేటాయించి జలయజ్ఞంలో భాగంగా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. 9 మండలాల పరిధిలోని 84 వేల ఎకరాలకు సాగునీటితోపాటు ఒంగోలు, దాని చుట్టుపక్కల 43 గ్రామాల పరిధిలోని 2.56 లక్షల మంది ప్రజలకు తాగునీటిని కూడా అందించారు. 2008 నవంబరు 24న జాతికి అంకితం చేశారు. తరువాత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు చివరి భూములకు కూడా సాగునీరు అందించేందుకు రూ.100 కోట్లు మంజూరు చేయించి కాలువలను ఆధునికీకరించారు.

ఒంగోలు రిమ్స్ తలమానికం

బీసీ–ఈ కోటాలో ఎంబీబీబీఎస్ సీటు వైఎస్సార్ చలవే