
మోసం చేయడమే బాబు నైజం
తీసేసిన పింఛన్లన్నీ తిరిగివ్వాలి సూపర్ సిక్స్ అట్టర్ ఫ్లాప్ మహిళలకు నెలకు ఇస్తామన్న రూ.1500 ఎక్కడ..? జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ
దర్శి: అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి, అవి అమలు చేయకుండా ప్రజలను నిలువునా మోసగించడమే బాబు నైజమని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అన్నారు. మండలంలోని కొత్తవెంకటాపురం గ్రామంలో బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ కార్యక్రమానికి ఆదివారం బూచేపల్లి వెంకాయమ్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని బూచేపల్లి వెంకాయమ్మకు ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు హయాంలో మహిళలకు జరిగిన అన్యాయం గురించి క్యూఆర్ కోడ్‌తో కూడిన ప్లకార్డుల ద్వారా వివరించారు. ఈ సందర్భంగా వెంకాయమ్మ మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికలకు ముందు 143 హామీలు ఇచ్చారని, అందులో ప్రధానంగా సూపర్ సిక్స్ అంటూ ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరైనా ఇప్పటికీ ఒక్క హామీ పూర్తిగా అమలు చేయలేదన్నారు. పింఛన్‌లు పెంచుతున్నామని చెప్పి ఉన్న పింఛన్‌లు ఊడపీకి వికలాంగుల నోళ్లు కొడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో 3780 పింఛన్‌లు తీసేశారని చెప్పారు. దర్శి నియోజకవర్గంలో 579 పింఛన్లు తొలగించారని, తీసేసిన వారికి గతంలో 90 శాతం వికలాంగత్వం ఉండి పింఛన్లు తీసుకుంటున్నా 40 శాతం లోపు మాత్రమే ఉందని నోటీసులు పంపారన్నారు. కొత్త పింఛన్‌లు ఇవ్వకపోగా ఉన్న పింఛన్లు తీసేసి దివ్యాంగుల కడుపు కొట్టడం దారుణంగా ఉందన్నారు. అవయవాల లోపంతో బాధపడుతున్న వారిపై కరుణ చూపాలి కానీ కక్ష సాధింపు చేయడం ఒక్క కూటమి ప్రభుత్వానికే చెల్లిందన్నారు. తీసేసిన పింఛన్లన్నీ దివ్యాంగులకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామని దారుణంగా మోసం చేశారన్నారు. సూపర్ సిక్స్ పేరుతో ఇచ్చిన ఆరు హామీలకే దిక్కు లేదని, ఇక చంద్రబాబు ఇచ్చిన 143 హామీలు పై ప్రజలు ఆశలు వదులుకున్నారన్నారు. కూటమికి ఓట్లెందుకు వేశామా అని మహిళలు బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలో ఎక్కడ ఏ గ్రామంలో చూసినా నాలుగైదుకు పైగా బెల్టు షాపులు ఉన్నాయని, గ్రామాల్లో విచ్చలవిడిగా నాసిరకం మద్యం సరఫరా చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. మద్యం మాఫియాకు అండగా ఉండి ఒక్కో బాటిల్‌కు రూ.50 ఎక్కువ వసూళ్లు చేయిస్తూ బెల్టు షాపులు నిర్వహిస్తున్న డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయో ప్రజలందరికీ తెలుసన్నారు. చంద్రబాబు ఒక్క హామీ పూర్తిగా అమలు చేయకుండా రూ.2 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికే సాధ్యమవుతుందని ఆయన్ను మళ్లీ సీఎం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ వెన్నపూస వెంకటరెడ్డి, రాష్ట్ర మున్సిపల్ వింగ్ ప్రధాన కార్యదర్శి కుమ్మిత అంజిరెడ్డి, వైస్ ఎంపీపీ సోముదుర్గారెడ్డి, ఐదో వార్డు కౌన్సిలర్ తుళ్లూరి బాబురావు, మాజీ సర్పంచ్ మానికొండ వెంకయ్య, బాదం వెంకటరెడ్డి, జింకల అంజిరెడ్డి, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.