
ఫీడర్ కెనాల్ పనుల పరిశీలన
పెద్దదోర్నాల:
మండల పరిధిలోని గంటవానిపల్లె వద్ద జరుగుతున్న ఫీడర్ కెనాల్ అండర్ టన్నెల్ పనులను ఇరిగేషన్ ఇన్‌చార్జి ఎస్‌ఈ అబూతాలిమ్ శుక్రవారం పరిశీలించారు. గంటవానిపల్లె వద్ద జరుగుతున్న అండర్ టన్నెల్ ఎస్కేప్ రెగ్యులేటర్ పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు క్యాంపు కార్యాలయంలో ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. వెలుగొండ ప్రాజెక్టు రెండవ సొరంగం తవ్వకం పనులు మరో కిలోమీటరు మేర జరగాల్సి ఉందని, దీంతో పాటు లైనింగ్ పనులు మరో 5.2 కిలోమీటర్ల మేర జరగాల్సి ఉన్నాయని అధికారులు ఎస్‌ఈ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా పనులు పూర్తి స్థాయిలో నిర్వహించేలా చూడాలని, దీంతో పాటు ఎస్కేప్ రెగ్యులేటర్ అండర్ టన్నెల్ పనులు వేగంగా జరిగేలా చూడాలని ఆయన అధికారులకు సూచించారు. ఎస్‌ఈ వెంట క్వాలిటీ కంట్రోల్ ఈఈ రాజగోపాల్, డీఈ. విద్యాసాగర్, ఏఈ అశోక్, ఇరిగేషన్ డీఈ చర్యణ్, ఏఈ అంజలి, మెగా కన్‌స్టక్షన్స్ డీఎం శ్రీనాథ్, ప్లానింగ్ ఇంజినీర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.