
మొలకెత్తని ఆశలు
జిల్లాలో ఖరీఫ్ సాగు నత్తనడకన సాగుతోంది. ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడం, భూగర్భ జలాలు అడుగంటడంతో సాగు ముందుకు సాగడం లేదు. సాధారణంగా ఖరీఫ్‌లో ఈ పాటికి జిల్లాలో కనీసం 30 శాతానికిపైగా పంటలు సాగుకావాల్సి ఉండగా ఈ ఏడాది పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. పంటల సాగు 8 శాతం మాత్రమే కాగా.. విత్తిన పొలాల్లోనూ మొలకలు రాక రైతులు నష్టపోతున్నారు. మరో వైపు గిట్టుబాటు ధరలు దక్కుతాయో లేదోనని మిర్చి సాగు చేయాలంటేనే రైతులు భయపడుతున్నారు.
● ఖరీఫ్ సాగు అరకొర
● ఆశించిన వర్షాలు లేక బీళ్లుగా పొలాలు
● ఇప్పటికి 8 శాతం మాత్రమే పంటల సాగు
● విత్తిన పొలాల్లోనూ మొలకలు రాక నష్టం
● మిర్చి వైపు చూడని రైతులు
మార్కాపురం: జిల్లా వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఖరీఫ్ ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం, పొలాలు పదునెక్కక వ్యవసాయం ముందుకు సాగడం లేదు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పడుతున్న వర్షపు జల్లులు తేమ శాతాన్ని పెంచుతున్నాయే తప్ప పంటలు సాగు చేసుకునేందుకు ఉపయోగపడటం లేదు. రుతుపవనాలు సకాలంలో వచ్చి వర్షాలు పడతాయని వాతావరణశాఖ అధికారులు ప్రకటిస్తున్నా ఆకాశంలో మబ్బుల జాడ తప్ప వర్షపు చినుకు పొలంలో పడటం లేదు. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌లో 1,29,102 హెక్టార్లలో పంటలు సాగు కావాల్సి ఉండగా ఇప్పటికి కేవలం 10,468 హెక్టార్లలో మాత్రమే సాగయ్యాయి. అంటే 8.11 శాతమే పంటలు సాగైనట్టు అంచనా.
పశ్చిమ ప్రకాశంలో కరువు పరిస్థితి ఇలా...
పశ్చిమ ప్రకాశంలో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. సాధారణ వర్షపాతం కూడా పలు మండలాల్లో నమోదు కాలేదు. ఎండిపోయిన చెరువులు, బీడు భూములు కనిపిస్తున్నాయి. సాధారణంగా ఖరీఫ్‌లో రైతులు సజ్జ, కంది, ఆముదం, పత్తి, మిర్చి పంటలు సాగు చేస్తారు. ఇటీవల కురిసిన వర్షానికి కొంత మంది రైతులు పొలాలు సిద్ధం చేసుకుంటున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఆలస్యంగా నాట్లు వేస్తే తెగుళ్లు వస్తాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి రోజు వర్షం కోసం రైతులు ఎదురుచూడటమే సరిపోతోంది. కొన్ని చోట్ల పత్తి, కంది, సజ్జ, జొన్న పైర్లు వేసినా మొలకలు రాలేదు. కొన్నిచోట్ల విత్తనాలు నాటిన తరువాత వర్షం కురవడంతో పొలంపై ఉన్న మట్టి అట్టలాగా మారి మొలకలు తక్కువగా వచ్చాయి.
పడిపోయిన మిర్చి సాగు:
ఈ ఏడాది మిర్చిసాగు గణనీయంగా తగ్గే అవకాశాలున్నాయి. గతేడాది గిట్టుబాటు ధరలేక పెట్టుబడుల డబ్బులు రాక మిర్చి రైతులు అవస్థలు పడుతున్నారు. నాడు వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మిర్చి రైతులకు ఎర్ర బంగారం కాగా నేడు భారంగా మారింది. 2021–22, 2022–23 సంవత్సరాల్లో క్వింటా మిర్చి ధర రూ.25 వేల నుంచి రూ.30 వేల మధ్య పలికింది. గతేడాది నుంచి ధరలు తగ్గుతూ వచ్చాయి. గతేడాది నవంబరులో రూ.15 నుంచి రూ.16 వేలు ఉన్న ధర ఫిబ్రవరి నాటికి రూ.11 వేలకు కూడా పలకలేదు. దీంతో ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లడంతో ప్రభుత్వం కొనుగోళ్లపై దృష్టిపెట్టింది. అయినా నష్టాలే మిగిలాయి. ఎకరా మిర్చిసాగుకు సుమారు రూ.లక్ష నుంచి రూ.1.25 లక్షల వరకూ ఖర్చు వస్తోంది. గతేడాది మిర్చికి తెగుళ్లు ఆశించడంతో అటు దిగుబడి తగ్గిపోయి, ఇటు గిట్టుబాటు ధరలేక తీవ్రంగా నష్టపోయారు. దీంతో ఈ ఏడాది మిర్చి సాగు చేయాలంటేనే రైతులు భయపడుతున్నారు. జిల్లా మొత్తం మీద ఈ సీజన్‌లో వెయ్యి ఎకరాలకు మించి సాగు కాలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
జిల్లాలో సాగు ఇలా...
పంట పేరు సాగైన విస్తీర్ణం
(హెక్టార్లలో)
వరి 249
జొన్న 34
సజ్జ 612
మొక్కజొన్న 1683
కొర్రలు 235
పెసలు 58
మినుములు 121
కందులు 117
వేరుశనగ 90
నువ్వులు 1954
పొద్దుతిరుగుడు 2
ఆముదం 585
పత్తి 4679
సోయాబీన్ 49

మొలకెత్తని ఆశలు

మొలకెత్తని ఆశలు

మొలకెత్తని ఆశలు