
హామీలు నెరవేర్చని ప్రభుత్వాన్ని సాగనంపుదాం
● జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ
కొత్తపట్నం: హామీలు నెరవేర్చని కూటమి ప్రభుత్వాన్ని సాగనంపడానికి రోజులు దగ్గరపడ్డాయని జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అన్నారు. మండలంలోని నల్లూరి గార్డెన్ పక్కనే ఉన్న స్థలంలో బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ముందుగా ఈతముక్కల నుంచి కొత్తపట్నం సభా కార్యక్రమానికి కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. బస్టాండ్ సెంటర్‌లో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమానికి ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు, మండల వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వెంకాయమ్మ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రతిసారీ మోసపూరిత మాటలు చెప్పి ఓట్లు వేయించుకుని మోసం చేస్తున్నాడని, ఇచ్చిన హామీలు నెరవేర్చనందుకే బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ కార్యక్రమం చేపట్టామన్నారు. తల్లికి వందనం, ఏడాదికి మూడు సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు వంటి పథకాలు ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పినవన్నీ నెరవేర్చారని అన్నారు. ఈ పథకాలు మళ్లీ అమలు కావాలంటే జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేసుకోవాలని కోరారు. పొగాకు రైతులను పరామర్శించడానికి వైఎస్ జగన్ వస్తే ఆయన్ను చూసేందుకు వచ్చిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై కేసులు పెట్టించడం సిగ్గుచేటున్నారు. ప్రజలకు మేలు జరిగేలా పథకాలు అమలు చేయాలి కానీ రెడ్‌బుక్ పేరుతో అక్రమ కేసులు పెట్టడం తగదన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్‌రావు మాట్లాడుతూ పోరాటం చేసి పోలీసులను కూడా లెక్క చేయకుండా సభా ప్రాంగణానికి చేరుకున్న కార్యకర్తలకు ఎంత అభిమానం ఉందో తెలుస్తోందన్నారు. చంద్రబాబు నాయుడు సింగపూర్ వెళ్తుంటే నాలుగు రోజులు పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రిగా చేస్తాడటని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పరిపాలన టీడీపీకి అప్పగించడం, పవన్ కల్యాణ్ నెలవారీ మామూళ్లు తీసుకోవడం చూస్తున్నామన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి మీటింగ్ పెడితే గజగజలాడుతున్నారని తెలిపారు.
వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ ప్రతి పేదవాడికి ఉచిత వైద్యం, ఉచిత విద్యుత్ అందించిన ఘనత వైఎస్ రాజశేఖరెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. 99 శాతం సంక్షేమ పథకాలు అమలుచేసిన వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి అని కొనియాడారు.
వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరి రవిబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేసిన మోసాలను గుర్తుచేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, గతంలో అందుకున్న పథకాలన్నీ మళ్లీ పొందాలంటే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని గెలిపించుకోవాలన్నారు. పార్టీ కార్యక్రమాలను అడుగడుగునా పోలీసులు అడ్డుకుంటున్నారని, కార్యకర్తలు కలసికట్టుగా ఉండి కార్యక్రమాన్ని విజయవంతం చేశారన్నారు.
మాజీ పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మాదాసి వెంకయ్య మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై పోలీసు కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని, తాము అండగా ఉంటామని చెప్పారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీ రమణారెడ్డి మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని, వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడు కాకుమాను రాజశేఖర్ మాట్లాడుతూ దమ్మున్న మగాడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అక్రమ కేసులు పెడితే వెనుకకు తగ్గేదే లేదన్నారు. ఎంపీపీ, మండల పార్టీ అధ్యక్షుడు లంకపోతు అంజిరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకుందని, మంచి ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకర్, వ్యవసాయ విభాగం జోనల్ అధ్యక్షుడు ఆళ్ల రవీంద్రరెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు సైకలం లక్ష్మీ శారద, మాజీ సర్పంచ్ దాచూరి గోపాల్‌రెడ్డి, బొట్ల సుబ్బారావు, ఎంపీటీసీ సభ్యుడు మిట్నసల శాంతారావు, మన్నె శ్రీనివాసరావు, వాయల సుమతి, నగరగంటి శ్రీనవాసరావు, పిచ్చిరెడ్డి, యేలు వెంకటేశ్వరరావు, మన్నె శ్రీధర్, ఓబుల్‌రెడ్డి, రమాదేవి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

హామీలు నెరవేర్చని ప్రభుత్వాన్ని సాగనంపుదాం