భూ దాహం | - | Sakshi
Sakshi News home page

భూ దాహం

Jul 28 2025 7:19 AM | Updated on Jul 28 2025 7:31 AM

పచ్చ నాయకుడి

నాగులుప్పలపాడు: అధికారం అండతో ఏడాది నుంచి కూటమి నేతల అకృత్యాలు రోజు రోజుకీ ఎక్కువైపోతున్నాయి. అడిగేవారు లేరని అందినకాడికి దోచుకుంటూ జేబులు నింపుకుంటున్నారు. ఇసుక, మద్యం, గ్రావెల్‌, బియ్యం ఇలా ఒకటేమిటి అందినకాడికి దోచుకుంటూ రెండు చేతులా సంపాదించుకుంటున్నారు. తాజాగా ఒంగోలు రూరల్‌ మండలం చింతాయగారిపాలెం గ్రామంలోని ప్రభుత్వ భూమిపై ఒక టీడీపీ నాయకుడి కన్నుపడింది. అంతే లక్షల రూపాయల విలువ చేసే స్థలాన్ని కబ్జా చేయడానికి పూనుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే ఒంగోలు రూరల్‌ మండలం చింతాయగారిపాలెం సర్వే నంబరు 409/1 లో 75 సెంట్ల స్థలం ఉంది. ఈ స్థలంలో గత ప్రభుత్వం గ్రామ సచివాలయం, రైతుభరోసా కేంద్రం, వెల్‌నెస్‌ సెంటర్ల నిర్మాణాలకు పూనుకుంది. సదరు స్థలం లోతట్టుగా ఉండటంతో అప్పట్లోనే దానిని కొంత మేరకు పూడ్చి, చదును చేయడానికి ప్రభుత్వం రూ.6 లక్షలు మంజూరు చేసింది. పూడిక, చదును చేసే పనులు పూర్తయిన తరువాత ఆ స్థలంలో 2020లో సచివాలయ నిర్మాణానికి చర్యలు చేపట్టారు. సచివాలయ భవన నిర్మాణం మొదలుపెట్టిన క్రమంలో గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు చాపల శ్రీనుతో పాటు మరికొంత మంది కలిసి ఆ భూమి తమదంటూ కోర్టుకు వెళ్లారు. అంతలోనే 2023 లో మళ్లీ ఆ భూమి తమది కాదని కోర్టులో వేసిన కేసును టీడీపీ నాయకులే తిరిగి వాపసు తీసుకున్నారు. అధికారులు కూడా పరిశీలించి ఈ భూమి టీడీపీ నాయకులది కాదని చెప్పడంతో మిన్నకుండిపోయాడు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ టీడీపీ నాయకుడు రెచ్చిపోయి ప్రభుత్వ భవనాల నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలోకి అక్రమంగా ప్రవేశించడమే కాకుండా ఆ స్థలంలోకి ఎవరినీ రానీయకుండా దౌర్జన్యం చేస్తూ బెదిరింపులకు గురిచేస్తున్నాడని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై గ్రామస్తులు ఇటీవల కలెక్టర్‌ను కలిసి విన్నవించారు. ఈ సమస్యపై ఇప్పటికై నా అధికారులు స్పందించి అక్రమార్కుల చెరలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని విడిపించి గ్రామ సచివాలయం, ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు సహకారం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ విషయమై వీఆర్వో రామకృష్ణను వివరణ కోరగా ఆ స్థలానికి సంబంధించి గతంలో ఇద్దరు వ్యక్తులు కోర్టును ఆశ్రయించారని, వారిలో ఒకతను కేసును వెనక్కి తీసుకున్నారని మరొక వ్యక్తి కేసు పెండింగ్‌ లోనే ఉందని తెలిపారు. ప్రస్తుతం ఆ స్థలంలోకి ఎవరినీ అనుమతించేది లేదని తెలిపారు.

ప్రభుత్వ స్థలం తనదంటూ టీడీపీ నాయకుడి దౌర్జన్యం ఒంగోలు రూరల్‌ మండలం చింతాయగారిపాలెంలో ఆక్రమించుకోవడానికి యత్నాలు ఇప్పటికే ఆ స్థలంలో సచివాలయం, రైతు సేవా కేంద్రం, హెల్త్‌ క్లినిక్‌ నిర్మాణ పనులు గతంలో కోర్టులో ఉన్న కేసు వెనక్కి అధికారం రావడంతో ఆ స్థలం తనదంటూ మళ్లీ గ్రామస్తులకు బెదిరింపులు

ఆక్రమణలు తొలగించి గ్రామాభివృద్ధికి తోడ్పడాలి

గ్రామంలో ప్రజల సౌలభ్యం కోసం సచివాలయం, మిగతా ప్రభుత్వ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ఇప్పటికే వాటిని నిర్మించుకోకపోవడం వలన అభివృద్ధికి దూరంగా ఉన్నాం. ప్రభుత్వ స్థలం ఆక్రమణలకు పాల్పడిన వ్యక్తులు ఇప్పటికై నా కోర్టు నిబంధనలకు లోబడి ఆక్రమణలు వదిలేసి గ్రామాభివృద్ధికి తోడ్పాటునందించి కలసి రావాలి.

– నాయుడు శ్రీరాములు, సర్పంచ్‌,

చింతాయగారిపాలెం

భూ దాహం 1
1/3

భూ దాహం

భూ దాహం 2
2/3

భూ దాహం

భూ దాహం 3
3/3

భూ దాహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement