తప్పుల తడక | - | Sakshi
Sakshi News home page

తప్పుల తడక

May 23 2025 3:04 PM | Updated on May 23 2025 3:04 PM

తప్పుల తడక

తప్పుల తడక

అయ్యోర్ల బదిలీల్లో..

ఒంగోలు సిటీ: టీచర్ల బదిలీల వ్యవహారమంతా గందరగోళంగా మారింది. బుధవారం నుంచి ఈ ప్రకియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఆరంభం రోజే సాంకేతిక సమస్య తలెత్తింది. సర్వర్‌ పనిచేయకపోవడంతో దరఖాస్తుదారులు అవస్థలు పడ్డారు. రెండోరోజు కూడా అదే పరిస్థితి. వెబ్‌సైట్‌ మొరాయిస్తోంది. జిల్లాలో విద్యాశాఖ నింబంధనల ప్రకారం హెచ్‌ఎంలు, స్కూల్‌ అసిస్టెంట్లు, ఎస్జీటీలు సుమారు 2 వేల మంది బదిలీ ప్రక్రియలో పాల్గొనే అవకాశం ఉంది. తొలి రెండు రోజులు ప్రధానోపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలోని 56 మండలాలకు సంబంధించి 133 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారు 11 మంది ఉన్నారు. గురువారం మధ్యాహ్నం వరకు సర్వర్‌ సక్రమంగా పనిచేయలేదని, ఆ తర్వాత నుంచి సర్వర్‌ పరవాలేదని ప్రధానోపాధ్యాయులు తెలియజేస్తున్నారు. అయితే, హెచ్‌ఆర్‌ఏ సమస్య రాత్రి పది గంటల సమయంలో పరిష్కారమైనట్టు తెలిసింది. దీంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.

ఆన్‌లైన్‌ వివరాలు అస్తవ్యస్తం...

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే సమయంలో పలు సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నట్టు ఉపాధ్యాయులు వాపోతున్నారు. స్కూల్‌ అసిస్టెంట్లకు సంబంధించి ఆన్‌లైన్‌లో బయోడేటా అంతా బాగానే ఉన్నా సర్వీస్‌ పాయింట్లు తప్పుల తడకలుగా చూపిస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యాశాఖ మార్గదర్శకాల ప్రకారం ఉపాధ్యాయుల ఎన్‌టైటిల్‌ పాయింట్లు గుణించి సీనియారిటీ జాబితా తయారు చేస్తారు. వీరిలో ప్రిఫరెన్షియల్‌ కేటగిరీ కిందకు వచ్చే వారికి తొలి ప్రాధాన్యతతో బదిలీకి అవకాశం కల్పిస్తారు. అయితే, ఈ పాయింట్లకు సంబంధించి తప్పుల తడకలుగా చూపిస్తున్నట్టు సమాచారం. 15 సర్వీసు పాయింట్లు ఉండాల్సి ఉంటే పది మాత్రమే చూపిస్తోందని, చాలా మందికి ఇదే సమస్య ఎదురవుతోందని తెలిసింది. అలాగే భార్యాభర్తలు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నప్పటికీ స్పౌజ్‌ పెట్టుకోకపోయినా ఆన్‌లైన్‌లో స్పౌజ్‌ చూపిస్తోందని, ఆప్షన్‌ డెలీట్‌ చేసినా స్పౌజ్‌ అని చూపిస్తోందని కొంత మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటికితోడు సర్వర్‌ సమస్య తలెత్తుతూనే ఉంది. ఇక ఎస్జీటీలకు అయితే అసలు సర్వర్‌ పనిచేయలేదని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. కొందరు ఉపాధ్యాయులైతే అసలు మిగులు ఉపాధ్యాయులు ఎంతమంది ఉన్నారు.. ఎక్కవ ఉన్నారని చెప్పకుండా బదిలీల ప్రక్రియ ఏ విధంగా ప్రారంభిస్తారని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.

1:45 అంగీకరించకుండానే...

ఒక్కో సెక్షన్‌కు 1:63 ప్రకారం విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి ఉండాలని ప్రభుత్వం ప్రకటించింది. ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో దాన్ని 1:49కి మార్చింది. దాన్ని కూడా ఉపాధ్యాయ సంఘాలు అంగీకరించడం లేదు. కానీ, సోమ, మంగళవారాలలో విద్యాశాఖ కార్యదర్శి సమక్షంలో నిర్వహించిన చర్చల్లో 1:49నే ఫైనల్‌ చేశారు. దీని వలన భవిష్యత్తులో ఉపాధ్యాయులకు ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 7 వేల మంది ఉపాధ్యాయులు అధికంగా ఉన్నారని ప్రభుత్వం చెబుతోంది. 1:45 ప్రకారం సెక్షన్లు విభజిస్తే ఈ సమస్య పరిష్కారమవుతుంది. ప్రభుత్వం మెగా డీఎస్సీ ప్రకటించడం తెలిసిందే. ఇప్పటికే 7 వేల మంది ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్నారని చెబుతున్న ప్రభుత్వం.. మెగా డీఎస్సీని ఏం చేస్తుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో చేపట్టిన ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ ఒక ప్రహసనంగా కొనసాగుతోంది.

ఎస్జీటీ బదిలీల లాబీయింగ్‌ షురూ...

ఎస్జీటీల బదిలీల ప్రక్రియలో దరఖాస్తులను ఆన్‌లైన్లో స్వీకరించనున్నారు. మిగతా వెరిఫికేషన్‌ లాంటివన్నీ ఆఫ్‌లైన్లో చేయనున్నారు. దీంతో ఎస్జీటీల బదిలీల్లో పెద్ద ఎత్తున చేతులు మారే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.

ఆరంభం నుంచే వెంటాడుతున్న సాంకేతిక సమస్య రెండోరోజూ సర్వర్‌ డౌన్‌ ఆన్‌లైన్‌లో వ్యక్తిగత వివరాల్లో తప్పులు 1:45 అంగీకారం కుదరకుండానే బదిలీలు సమస్యలు పరిష్కరించాకే ప్రక్రియ ప్రారంభించాలని ఉపాధ్యాయ సంఘాల డిమాండ్‌ తొందరపడి దరఖాస్తు చేసుకోవద్దంటున్న సంఘాలు

జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ప్రహసనంగా సాగుతోంది. రెండు రోజులుగా సర్వర్‌ మొరాయిస్తోంది. అలాగే ఆన్‌లైన్‌లో వ్యక్తిగత

వివరాలన్నీ తప్పులతడకలుగా ఉన్నాయి. సమస్యలు పరిష్కరించకుండా బదిలీలు ఎలా అంటూ ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. దీనికితోడు పాఠశాలల పునర్‌వ్యవస్థీకరణ సమస్యపై ఉపాధ్యాయులకు అభ్యంతరాలున్నాయి. దాన్ని పూర్తిగా పరిష్కరించకుండానే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు. మొత్తం మీద ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు అన్నట్లు సాగుతోంది. జిల్లావ్యాప్తంగా సుమారు రెండువేల మంది వరకూ బదిలీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

తొందరపడకండి...

సమస్యలు పరిష్కరించకుండా ఆగమేఘాల మీద బదిలీలు ఎందుకు చేపట్టాల్సి వచ్చిందని ఉపాధ్యాయ సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ముందుగా సమస్యలు పరిష్కరించిన తర్వాతే బదిలీలు చేపట్టాలని పలుమార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నప్పటికీ పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం మన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకోకుండా మోసం చేసిందని, తొందరపడి దరఖాస్తు చేసుకోవద్దని ఉపాధ్యాయ సంఘాల నాయకులు సూచిస్తున్నారు. మొత్తం మీద బదిలీల ప్రక్రియలో రాబోయే రోజుల్లో ఎటువంటి సమస్యలు తలెత్తుతాయోనని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, ప్రభుత్వం మాత్రం ఇవేమీ పట్టనట్లు తన పని తాను చేసుకునిపోతూ చుక్కలు చూపిస్తోందన్న ఆరోపణలు ఉపాధ్యాయవర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. ఇదిలా, ఉండగా పదోన్నతులు, బదిలీల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు డీఈఓ కార్యాలయ ఉద్యోగులెవరూ సెలవులు పెట్టవద్దని డీఈఓ కిరణ్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement