
చోద్యంగాక ఇంకేంటి?
పొదిలి రూరల్: మూసీవాగు సమీపంలో ఉన్న రైతులు తమ సొంత పొలాల సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిని ఏళ్లతరబడి సాగు చేసుకుంటున్నారు. పంటలు పండించుకుంటూ పశువులకు మేత పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. ఈ వ్యవహారం మూసీవాగు పరిసర ప్రాంతంలో చాలాకాలంగా సాగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భూమిపై కొందరు కూటమి నాయకులు కన్నేశారు. ఎలాగైనా వీటిని తమ చేతుల్లోకి తెచ్చుకోవాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా నెల క్రితం కూటమి నాయకులు అధికారులను కలిశారు. కొందరు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్నారని, ఆక్రమణదారుల చెర నుంచి ఆ భూమిని విడిపించాలని కోరారు. కూటమి నేతలకు తలొగ్గిన అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. ఆక్రమణలు తొలగించాలని కొందరు రైతులకు మాత్రమే చెప్పారు. మిగిలిన రైతులను పట్టించుకోలేదు. అందరిపై చర్యలు తీసుకోవాలని, కొందరికి మాత్రమే భూములు ఖాళీ చేయాలని చెప్పడం ఏమిటని బాధిత రైతులు ప్రశ్నించారు. చివరకు కొందరు రైతులకు మాత్రమే అధికారులు నోటీసులు ఇచ్చారు. దీనికి రైతులు ప్రస్తుతం పశుగ్రాసం ఉందని, కోతలైన వెంటనే తొలగిస్తామని సమాధానం చెప్పారు. అయినా రెవెన్యూ సిబ్బంది వినకుండా పొదిలి మండలం కుంచేపల్లి పంచాయతీలోని దాసళ్లపల్లి గ్రామ ససర్వే నెంబరు 11, కుంచేపల్లిలో సర్వే నెంబరు 25, 17 సర్వే నంబర్లలో ఉన్న 17 ఎకరాల వాగు పోరంబోకు భూమిలో ఆక్రమణలు జరిగాయని వారం క్రితం 8 మంది రైతులకు నోటీసులు ఇచ్చారు. 8 మందిలో కుంచేపల్లికు చెందిన పేరం నాగిరెడ్డి, మేడం నారాయణరెడ్డి, పేరం శ్రీనివాసరెడ్డి, బాదం శ్రీనివాసరెడ్డి ,దాసళ్లపల్లికు చెందిన గంగుల వెంకట్రావు, సీదా తిరుపతయ్య, గంగుల నరసింహారావు, గంగుల అచ్చయ్య ఉన్నారు. శనివారం ఆక్రమణలు తొలగించేందుకు తహసీల్దార్ ఎంవీ కృష్ణారెడ్డి పోలీసులు, జేసీబీతో వచ్చారు. పశువుల కోసం సాగు చేసుకున్న పశు గ్రాసాన్ని పొక్లెయిన్‌తో ధ్వంసం చేశారు. పొలం చుట్టూ ఉన్న గట్లను చదును చేసి తొలగించారు. కొంతమంది రైతులు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. రెండు నెలల్లో తీసివేసే పశుగ్రాసాన్ని యంత్ర సాయంతో తొలగించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ ఆక్రమణలు తొలగించాలనుకుంటే మూసీవాగుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణదారులకు నోటీసులు ఇచ్చి తీసివేయాలని, అధికారులు వివక్ష చూపారని మండిపడుతున్నారు. దీనిపై తహసీల్దార్ కృష్ణారెడ్డిని వివరణ కోరగా ముందుగా వచ్చిన ఫిర్యాదుపై రైతులకు నోటీసులు ఇచ్చామని, ఆ తర్వాత మిగిలిన వారికి కూడా నోటీసులు ఇచ్చి తొలగిస్తామని స్పష్టం చేశారు.