
భారీ వర్షం
నల్లమల అటవీ ప్రాంతంలో
● రోడ్డుకు అడ్డంగా కూలిన చెట్టు
రాచర్ల: మండలంలోని జేపీ చెరువు సమీపం నల్లమల అటవీ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉరుములు, మెరుపులు, గాలితో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులు, భారీ వర్షం కారణంగా నెమలిగుండ్ల రంగనాయకస్వామి ఆలయం సమీపంలోని లక్ష్మమ్మ వనం వద్ద భారీ చెట్టు కూలి రోడ్డుకు అడ్డంగా పడింది. రోడ్డుకు అడ్డంగా చెట్టు కూలడంతో నెమిలిగుండ్ల రంగనాయకస్వామి దర్శనం కోసం వెళ్లిన భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విషయం తెలుసుకున్న ఎస్సై కోటేశ్వరరావు సంఘటన స్థలానికి చెరుకుని జేసీబీల సాయంతో రోడ్డుకు అడ్డంగా పడిన చెట్టును తొలగించారు. మిషన్లతో చెట్టు కొమ్మలను కత్తిరించి పక్కకు తిప్పంచారు. అనంతరం ట్రాఫిక్‌లో చిక్కుకున్న వాహనాలను పంపించారు. భారీ వర్షం కారణంగా కొండపై నుంచి వరద నీరు అధికంగా వచ్చింది. చాలా కష్టంతో భక్తులు వాగు దాటారు. ఉరుములు, మెరుపులు, గాలితో కూడిన భారీ వర్షం కారణంగా ఎలాంటి అస్తి, ప్రాణ నష్టం జరగలేదని ఎస్సై కోటేశ్వరరావు తెలిపారు.