
స్టాండింగ్ కమిటీ లేనట్లే..!
ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగర పాలక సంస్థలో స్టాండింగ్ కమిటీ ఇక లేనట్లేనా అంటే ఔననే సమాధానం వస్తోంది. స్టాండింగ్ కమిటీ కాలపరిమితి పూర్తయి ఏడాది దాటినా నోటిఫికేషన్ ఇవ్వకుండా వదిలేయడంతో పురపాలన తీరును తేటతెల్లం చేస్తోంది. నగరంలో చేపట్టే అన్ని అభివృద్ధి పనులకు ముందస్తుగా మేయర్ అనుమతి తీసుకుని, ఆ తర్వాత కౌన్సిల్లో ప్రవేశపెట్టి మంజూరు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. రూ.10 లక్షలలోపు పనులకు కమిషనర్, రూ.10 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు పనులను స్టాండింగ్ కమిటీ ఆమోదించవచ్చు. కానీ ఒంగోలు నగర పాలక సంస్థలో స్టాండింగ్ కమిటీ ఊసే లేకుండా చేశారు. కూటమి పార్టీల నేతల మధ్య పొంతన కుదరకపోవడం ఇందుకు ఒక కారణం. మూడు నెలలకు ఒకసారి ఏర్పాటు చేసే ఒంగోలు నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశం మంగళవారం ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సోమవారం ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ టీడీపీ కార్పొరేటర్లతో అంతర్గత సమావేశం నిర్వహించారు. వీరి మధ్య స్టాండింగ్ కమిటీ ప్రస్తావన రాగా అందరూ స్టాండింగ్ కమిటీలో స్థానం కోసం పోటీపడినట్లు విశ్వసనీయ సమాచారం. 50 మంది కార్పొరేటర్లలో 25 మంది టీడీపీ, 21 మంది జనసేనలో ఉన్నారు. స్టాండింగ్ కమిటీలో నియమించేది ఐదుగురు సభ్యులను మాత్రమే కావడంతో ఇప్పుడు సాధ్యమయ్యే పనికాదని ఎమ్మెల్యే పేర్కొన్నట్లు సమాచారం. కాంట్రాక్ట్ పనుల కోసం ఇసుక, కంకర, ఇటుక తోలిన ప్రాంతాలకు వెళ్లి కూటమి నేతలు తనకు చెడ్డ పేరు తెస్తున్నారని దామచర్ల అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
124 అంశాల్లో 50కి పైగా ముందస్తు అనుమతులే..
మంగళవారం నిర్వహిస్తున్న సాధారణ కౌన్సిల్ సమావేశంలో దాదాపు రూ.20 కోట్లకు పైగా నిధుల మంజూరు కోసం మొత్తం 124 అంశాలు పొందుపరిచారు. వాటిలో 50కి పైగా అంశాలు ముందస్తు అనుమతుల కోసం పొందుపరిచినవే కావడం గమనార్హం. గతంలో వైఎస్సార్‌సీపీకి కౌన్సిల్లో పూర్తి స్థాయి మెజారిటీ ఉన్నప్పుడు ముందస్తు అనుమతులు తీసుకుని కౌన్సిల్లో రాటిఫికేషన్‌కు పెడితే టీడీపీ ఫ్లోర్ లీడర్ రమణయ్య నానా యాగీ చేశారు. ప్రస్తుతం టీడీపీ కూటమికి కౌన్సిల్లో మెజారిటీ ఉన్నా ఇబ్బడిముబ్బడిగా రాటిఫికేషన్లు పెడుతున్నారు. అయినా నాడు యాగీ చేసిన నాయకులు నేడు కిమ్మనడం లేదు.
జీరో అవర్‌కు మంగళం
నగరంలో సాధారణ సమస్యలపై చర్చించే అవకాశమే లేకుండా చేశారు. అజెండాలో పొందుపరిచిన అంశాలపైనే చర్చించి ఎవరి దారిన వారు వెళ్లిపోతున్నారు. కౌన్సిల్ సమావేశాల్లో ‘‘జీరో’’ అవర్ ప్రవేశపెడితే ప్రజలు ఎదుర్కొంటున్న సాధారణ సమస్యలను సభ్యులు లేవనెత్తే అవకాశం ఉంటుంది. మంచినీరు, పారిశుధ్యం, చెత్త ఆటోల తొలగింపు, డ్రెయినేజీలు తదితర సమస్యలపై సభ్యులు మాట్లాడే అవకాశం ఒక్క జీరో అవర్‌లోనే ఉంటుంది. అందుకోసం కౌన్సిల్ సమావేశంలో జీరో అవర్‌ను ప్రవేశపెట్టాలని వైఎస్సార్‌సీపీ సభ్యులు కోరుతున్నారు.
కాల పరిమితి పూర్తయ్యి ఏడాదైనా నేటికీ వెలువడని నోటిఫికేషన్ రూ.40 లక్షల వరకు పనులు స్టాండింగ్ కమిటీ ఆమోదంతో పూర్తి చేయవచ్చు అజెండాలోని అంశాలకే పరిమితమవుతున్న కౌన్సిల్ సాధారణ సమస్యలపై చర్చించే జీరో అవర్‌కు మంగళం నేటి కౌన్సిల్ సమావేశంలో 124 అంశాలు.. 50కి పైగా ముందస్తు అనుమతులపైనే..