టీడీపీలో పీఠముడి! | - | Sakshi
Sakshi News home page

టీడీపీలో పీఠముడి!

Aug 13 2024 2:16 AM | Updated on Aug 13 2024 1:15 PM

టీడీపీలో పీఠముడి!

టీడీపీలో పీఠముడి!

ఇంటిపోరు ఇంతింతగాదయా!

ఒంగోలు నగర మేయర్‌ పీఠం దక్కించుకునేందుకు దామచర్ల కుట్రలు బలం లేకపోయినా ఫిరాయింపులతో పాగా వేసేందుకు జిత్తులు ఇప్పటికే వైఎస్సార్‌ సీపీ కార్పొరేటర్లతో రాయ‘బేరాలు’ పూర్తి వారికి పెత్తనమిస్తే తమ భవిష్యత్తు ఏమిటని టీడీపీ నేతల్లో ఆందోళన ఎమ్మెల్యే జనార్దన్‌ తీరుపై మండిపడుతున్న తెలుగు తమ్ముళ్లు సర్దిచెప్పలేక తప్పించుకు తిరుగుతున్నట్లు దామచర్లపై విమర్శలు

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా ఒంగోలులో టీడీపీ పరిస్థితి తయారైంది. టీడీపీ కూటమి అధికారంలో ఉన్నా.. క్షేత్ర స్థాయిలో పెత్తనం చేయడానికి ఆ పార్టీ ప్రజాప్రతినిధులకు వీలుపడటం లేదు. స్థానిక సంస్థల్లో వైఎస్సార్‌ సీపీ బలంగా ఉండటమే అందుకు కారణం. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌ సీపీ వర్గీయులకు గాలం వేసి టీడీపీలోకి చేర్చుకునేందుకు పావులు కదుపుతున్నారు. సొంతంగా బలం లేకపోయినా పెత్తనం కోసం టీడీపీ నేతలు వేస్తున్న ప్రయత్నాలపై ఆ పార్టీ నేతల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 

జిల్లా కేంద్రమైన ఒంగోలు నియోజకవర్గ టీడీపీలో అసంతృప్తి జ్వాలలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఒంగోలు మేయర్‌ పీఠాన్ని చేజిక్కించుకోవాలన్న కుటిల యత్నాలకు స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ తెరలేపారు. నగరంలోని వైఎస్సార్‌ సీపీ కార్పొరేటర్లను బెదిరిస్తూ.. తాయిలాలు ఆశ చూపుతూ పచ్చ కండువాలు కప్పుతుండటాన్ని చూసి టీడీపీ కేడర్‌ రగిలిపోతోంది. ప్రత్యర్థులందరినీ పార్టీలో చేర్చుకుని పెత్తనం అప్పగిస్తే తమ పరిస్థితి ఏమిటని బహిరంగంగానే ధిక్కార స్వరం వినిపిస్తున్నారు.

రాజీనామాలే శరణ్యం!
వాస్తవంగా కార్పొరేషన్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి 43 మంది కార్పొరేటర్లు ఉన్నారు. టీడీపీ ఆరుగురు, జనసేకు ఒక్కరు ఉన్నారు. అయితే కార్పొరేషన్‌పై పెత్తనం సాగించాలంటే ఉన్న బలం అస్సలు చాలదు. ఎన్నికల ముందు వైఎస్సార్‌సీపీ నుంచి నలుగురు కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత మరింత మంది కార్పొరేటర్లను పార్టీ చేర్చుకునేందుకు జనార్దన్‌ కుతంత్రాలకు తెరతీశారు. 

అందులో భాగంగా ఐదుగురు కార్పొరేటర్లను పార్టీలో చేర్చుకున్నారు. దీనిపై నగరంలోని టీడీపీ ముఖ్య నాయకులంతా సమావేశమై వైఎస్సార్‌సీపీ నుంచి వచ్చే కార్పొరేటర్లను పార్టీలో చేర్చుకోవడంపై వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ప్రత్యర్థులుగా ఉన్న వారి నాయకత్వాన్ని అంగీకరించేందుకు మనసు ఎలా ఒప్పుకుంటుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌ సీపీ కార్పొరేటర్లను చేర్చుకోవద్దని చెబుతూనే.. తమ మాట వినకుంటే టీడీపీకి రాజీనామా చేయడానికై నా వెనుకాడబోమంటూ దామచర్లకు హెచ్చరికలు జారీ చేస్తుండటం నగరంలో చర్చనీయాంశంగా మారింది. 

టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకుల నుంచి వస్తున్న వ్యతిరేకతను చూసి ఆ పార్టీ టీడీపీ క్యాడర్‌లో కూడా గందరగోళం నెలకొంది. తెలుగు తమ్ముళ్లకు సర్దిచెప్పడం తలనొప్పిగా మారడంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్నట్లు విమర్శలొస్తున్నాయి. కొందరు నాయకులను శాంతింపజేసి.. మీ అనుమతి లేకుండా పార్టీలో ఎవరినీ చేర్చుకోబోమంటూ దామచర్ల బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ అసంతృప్తి జ్వాలలు చల్లారడం లేదు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement