
విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న గ్రానైట్ క్వారీల యజమానులు, ఏజెంట్లు
● ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాల పరిధిలోని గ్రానైట్ క్వారీల్లో..
చీమకుర్తి: గ్రానైట్ భద్రతా వారోత్సవాలను ఈ నెల 11 నుంచి 16 వరకు నిర్వహించనున్నట్లు భద్రతా వారోత్సవాల కమిటీ ఆదివారం వెల్లడించింది. రామతీర్థంలోని వీటీసీ కేంద్రంలో వారోత్సవాల కమిటీ సభ్యులు చలువాది బదరీనారాయణ, రవిచంద్రన్, పవన్‌కుమార్, సుభాస్కర్‌రెడ్డి, వెంకట లోకేష్, చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వారోత్సవాలలో నిర్వహించే భద్రతా ప్రమాణాల గురించి వివరించారు. ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని అన్ని గ్రానైట్ క్వారీలలో 21వ భద్రతా వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మైన్స్ అండ్ సేఫ్టీ డిప్యూటీ డైరెక్టర్ ఆధ్వర్యంలో వారోత్సవాలు నిర్వహిస్తామన్నారు. రామతీర్థంలోని యాపిల్ గ్రానైట్ క్వారీ యాజమాన్యం ఆతిథ్యంలో వారోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. గ్రానైట్ క్వారీల్లో కార్మికులు ఉపయోగించే భారీ వాహనాలైన క్రేన్‌లు, డంపర్‌లు, ఇతర వాహనాలను వినియోగించటంలో కార్మికుల వృత్తి నైపుణ్యాలతో పాటు కార్మికుల రక్షణ, భద్రతా విధానాలు, క్వారీ యాజమాన్యం కల్పిస్తున్న రక్షణ ఏర్పాట్లపై భద్రతా కమిటీ పర్యవేక్షణ చేస్తారన్నారు. వారోత్సవాల్లో ప్రమాణాలను పాటించిన క్వారీలకు పాయింట్లు కేటాయించి నైపుణ్యతను కల్పించిన క్వారీలు, కార్మికులకు బహుమతులను అందజేస్తామని తెలిపారు. 24వ తేదీ వారోత్సవాల ముగింపు రోజున బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు.