
సీఎం గారూ.. సీహెచ్‌ఓల వైపు చూడండి
● కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల వినూత్న నిరసన
ఒంగోలు టౌన్: అయ్యా సీఎం గారూ.. గత 24 రోజులుగా సమ్మె చేస్తున్నాం.. మా న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని చేతులెత్తి వేడుకుంటున్నాం.. ఇప్పటి వరకూ మావైపు చూడలేదు.. కనీసం ఒక అధికారిని పంపించి మమ్మల్ని పలకరించలేదు.. మా సమ్మెతో గ్రామాల్లో వైద్యసేవలందక ప్రజలు అవస్థపడుతున్నారు.. గ్రామాలకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పీహెచ్‌సీలకు వెళ్లలేక బాధపడుతున్నారు.. ఆర్‌ఎంపీల వద్దకు వెళ్లి ఇబ్బందులు కొనితెచ్చుకుంటున్నారు.. సార్, మావైపు చూడండి... అంటూ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. గురువారం స్థానిక కలెక్టరేట్ వద్ద మహిళా సీహెచ్‌ఓలు చున్నీలతో ఆయ్యా సీఎం సార్.. మా సీహెచ్‌ఓల వైపు చూడండంటూ రోడ్డుపై రాసి ప్రదర్శించారు. ఈ సందర్భంగా సీహెచ్‌ఓలు మాట్లాడుతూ సమ్మె చేస్తున్న సీహెచ్‌ఓలను ఇప్పటి వరకు ప్రభుత్వం చర్చలకు పిలవకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రజలకు ఆరోగ్య సేవలు అందజేయడమే కాకుండా గ్రామీణ తాగునీటి నాణ్యతను ఎప్పటికప్పడు పరిశీలిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న సీహెచ్‌ఓలు సమ్మె చేపడితే ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదని వాపోయారు. ఇప్పటికై నా సీహెచ్‌ఓల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో ఏపీఎంసీఏ జిల్లా నాయకులు, సీహెచ్‌ఓలు పాల్గొన్నారు.