
రేపు ఒంగోలులో మెగా జాబ్‌మేళా
ఒంగోలు వన్‌టౌన్: స్థానిక మంగమూరు రోడ్డులోని నాగార్జున డిగ్రీ కళాశాలలో ఈ నెల 24వ తేదీ మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన యువతీ యువకులు పాల్గొనవచ్చన్నారు. సాఫ్ట్‌వేర్ కంపెనీలు, ఐటీ, ఫార్మసీ, ప్రొడక్షన్, మాన్యుఫాక్చరింగ్, వివిధ కంపెనీలు, రాపిడో డిస్ట్రిబ్యూషన్, హెల్మెట్, షర్ట్‌లు, టీ షర్ట్‌లు, తదితర కంపెనీలు జాబ్‌మేళాలో పాల్గొంటాయన్నారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ధ్రువీకరణ పత్రాలతో జాబ్‌మేళాలో పాల్గొనాలని కోరారు.
ఏపీఈఏపీ సెట్‌కు
1886 మంది హాజరు
ఒంగోలు సిటీ: ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి గురువారం నిర్వహించిన ఏపీఈఏపీ సెట్ పరీక్షకు జిల్లాలో 1,886 మంది హాజరయ్యారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కాకినాడలోని జేఎన్‌టీయూ భాగస్వామ్యంతో ఏపీఈఏపీ సెట్–2025 నిర్వహిస్తోంది. జిల్లాలో రెండోరోజు మొత్తం 1959 మందికిగానూ, 1886 మంది (96.27 శాతం) హాజరయ్యారు.
యోగా పాఠ్యాంశం రాజ్యాంగ విరుద్ధం
ఒంగోలు వన్‌టౌన్: పాఠ్యాంశంగా యోగాను చేర్చడం రాజ్యాంగ విరుద్ధమని భారత హేతువాద సంఘ అధ్యక్షుడు నార్నె వెంకట సుబ్బయ్య అన్నారు. ఒంగోలులోని సంఘ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు యోగాను పాఠ్యాంశంగా చేరుస్తామని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. యోగా అనేది మతపరమైన ఆచారమని అన్నారు. క్రీస్తు పూర్వం 200 సంవత్సరాల క్రితం పతంజలి ఆత్మ పరమాత్మలో కలిసేందుకు యోగా మార్గమని ప్రతిపాదించాడన్నారు. యోగా చావుకి దగ్గరి మార్గమని, యోగా లక్ష్యం ముక్తిపొందడం అని అన్నారు. యోగా శాసీ్త్రయం కాదన్నారు. యోగా వంటి మతపరమైన కార్యక్రమాలను లౌకికరాజ్యంలో ప్రతిఒక్కరూ పాటించాలని ప్రకటించడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. విలేకరుల సమావేశంలో ఏపీ హేతువాద సంఘ అధ్యక్షుడు ఎంకే బేగ్, సీపీఐ నాయకులు ఉప్పుటూరి ప్రకాశరావు, శిఖా చంద్రశేఖర్‌బాబు, పౌరహక్కుల సంఘ నాయకులు గుమ్మళ్ల నరసింహారావు, సుభానీ, తదితరులు పాల్గొన్నారు.