
విద్యుదాఘాతంతో 22 గేదెలు మృతి
మార్కాపురం: పొలాల్లో మేతకు వెళ్లిన 20 గేదెలు విద్యుదాఘాతానికి గురై మృత్యువాతపడ్డాయి. ఈ సంఘటన గురువారం మార్కాపురం మండలం చింతగుంట్ల–తిప్పాయిపాలెం గ్రామాల మధ్య ఉన్న రామిరెడ్డి నగర్ సమీపంలో చోటుచేసుకుంది. చింతగుంట్ల, అయ్యవారిపల్లి, బడేఖాన్ పేట, తిప్పాయిపాలెం గ్రామాలకు చెందిన పాడి రైతులు తమ గేదెలను గురువారం ఉదయం మేత కోసం సమీప పొలాల్లోకి తోలారు. చీకటి పడినా గేదెలు ఇంటికి రాకపోవడంతో వెదుకులాట ప్రారంభించారు. ఈ క్రమంలో రామిరెడ్డినగర్ వాసులు ఒకే చోట 20 గేదెలు విద్యుదాఘాతానికి గురై మృతి చెంది ఉండటాన్ని గుర్తించారు. మందటి చిన్న ఆనందరెడ్డికి చెందిన 2 గేదెలు, మందటి వెంకటరెడ్డి 2 గేదెలు, దొంతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి 2, తేలుకుట్ల చిన్న వెంకటరెడ్డి 3, సింగపోగు గురవమ్మ 8, ఎం.రంగారెడ్డికి చెందిన ఒక గేదెతోపాటు ఇంకా పలువురు రైతులకు చెందిన పాడి గేదెలు ఉన్నాయి. ప్రమాద సమాచారాన్ని తెలుసుకున్న పాడి రైతులు సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. మృతి చెందిన గేదెల విలువ సుమారు రూ.15 లక్షలు ఉండొచ్చని అంచనా.
హెటీ లైన్ తెగి పడటమే కారణం
బుధవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షానికి హెటీ లైన్ విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. మేతకు వెళ్లిన గేదెలకు ఆ తీగలు తగలడంతో షాక్‌కు గురై మృతి చెందినట్లు తెలుస్తోంది. గేదెల మృతిపై విద్యుత్ శాఖ ఏఈ నాగేందర్ రెడ్డిని వివరణ కోరగా విద్యుత్ షాక్‌కు గురైతే ట్రాన్స్‌ఫార్మర్ ట్రిప్ అయి సరఫరా నిలిచిపోతుందని, కానీ అలా జరగలేదన్నారు. పిడుగుపాటుకు గురై మృతి చెంది ఉండొచ్చని చెప్పారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
రావిపాడులో రెండు గేదెలు మృతి
కంభం: విద్యుదాఘాతానికి గురై రెండు గేదెలు మృతి చెందిన సంఘటన కంభం మండలంలోని రావిపాడు గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామ రైతు నారాయణరెడ్డికి చెందిన రెండు గేదెలు స్థానిక బీసీ కాలనీలోని విద్యుత్ స్తంభం వద్ద షాక్‌కు గురై మృతి చెందాయి. సుమారు 1.80 లక్షల విలువ చేసే గేదెలు మృతి చెందడంతో రైతు బోరుమని విలపించాడు. నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాడు.
పాడి రైతులకు రూ.17 లక్షల నష్టం

విద్యుదాఘాతంతో 22 గేదెలు మృతి

విద్యుదాఘాతంతో 22 గేదెలు మృతి